అవినీతికి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌కు ముడిపెడుతూ ఆ పార్టీ మాజీ ఎంపీ, కేపీసీసీ మీడియా సమన్వయకర్త మాట్లాడుకున్న వీడియో ఆ పార్టీని చిక్కుల్లో పడేసింది. మంగళవారం బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించే ముందు స్టేజీపైనే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఆధారంగా చేసుకుని భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఏం మాట్లాడుకున్నారు?
మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప, కేపీసీసీ మీడియా సమన్వయకర్త సలీమ్ మధ్య 'పర్సంటేజ్ డీల్' గురించి ఈ సంభాషణ జరిగింది. "అంతకుముందు అది 6-8శాతం ఉండేది. డీకే శివ కుమార్ వచ్చాక దానిని 12శాతం చేశారు. మాట్లాడేటప్పుడు ఆయన కాస్త తడబడతారు. అది లో బీపీ వల్లనో, లేదంటే ఆయన తాగి ఉండడం వల్లనో నాకు తెలియదు. మీడియా కూడా అదే(ఆయన తాగారా అని) అడిగింది. కానీ.. ఆయన తాగలేదు. సిద్ధరామయ్య అలా కాదు. ఆయన బాడీ లాంగ్వేజ్ స్మార్ట్‌గా ఉంటుంది. డీకేను పార్టీ అధ్యక్షుడ్ని చేసేందుకు మనందరం పోరాడాం. కానీ.. ఆయన మనల్ని, పార్టీని దెబ్బతీశారు." అని పక్కనే కూర్చున్న ఉగ్రప్పతో అన్నారు సలీమ్. ప్రెస్ మీట్‌కు ముందు కెమెరాలు అన్నీ ఉండగానే వీరు ఇలా మాట్లాడుకున్న వీడియో వైరల్ అయింది.
భాజపా విమర్శలు..
సలీమ్-ఉగ్రప్ప సంభాషణను విమర్శనాస్త్రంగా మలుచుకుంది భాజపా. "మీ సొంత పార్టీ నేతలే ప్రెస్ మీట్లో మిమ్మల్ని దొంగ అంటున్నారు? మీరు దొంగా? మీరు 12శాతం లంచం తీసుకుంటారా? అలా దోచుకున్న సొమ్మును పార్టీ యజమానులతో పంచుకుంటారా? దయచేసి స్పష్టత ఇస్తారా" అని శివ కుమార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది కర్ణాటక భాజపా.
ఉగ్రప్ప వివరణ..