Karnataka Election Results 2023 : "కింగ్ మేకర్ కాదు.. మా పార్టీ కింగ్ అవుతుంది. కర్ణాటకలో మేమే అధికారాన్ని చేపడతాం".. ఎన్నికలు ముగిసిన తర్వాత జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చెప్పిన మాటలు ఇవి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కానీ ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఎక్కువ సీట్లు సాధించి కింగ్ మేకర్ అవుదామనుకున్న జేడీఎస్.. ప్రస్తుతం ఉన్న స్థానాలను సైతం చేజార్చుకుంది. పార్టీకి కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలో పట్టు కోల్పోయింది. మరోవైపు మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ సైతం ఓడిపోయారు.
Karnataka Elections JDS : కర్ణాటకలో రాజకీయాల్లో జేడీఎస్‌ది ప్రత్యేకమైన స్థానం. తక్కువ స్థానాలే గెలుచుకున్న ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. గతేడాది ఎన్నికలనే పరిశీలిస్తే.. 224 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో 37 స్థానాలు మాత్రమే గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈసారి కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషించాలని భావించింది జేడీఎస్. 120కి పైగా సీట్లు వస్తాయని.. కర్ణాటకలో తాము అధికారం చేపడతామని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. తాము కింగ్‌మేకర్ కామని.. కింగ్ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆయన అంచనాల తలకిందులు చేస్తూ 19 స్థానాలకే పరిమితమైంది.
జేడీఎస్ కంచుకోటకు గండి
Old Mysore JDS : పాత మైసూరు.. జేడీఎస్ పార్టీకి కంచుకోట భావించే ప్రాంతం. జేడీఎస్ మొత్తం గెలిచే స్థానాల్లో మూడింతలు ఈ ప్రాంతంలోనే గెలుచుకుంటుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 40 సీట్లు గెలిస్తే.. ఓల్డ్ మైసూరులో 28 స్థానాలు గెలుచుకుంది. 2018లో మొత్తం 37 స్థానాలు గెలిస్తే.. ఇక్కడే 31 సీట్లను సాధించింది. ఈసారి కూడా తమకు పట్టున్న ఓల్డ్ మైసూరు ప్రాంతంలో ఎక్కువగా సీట్లు సాధించాలని భావించింది. కానీ పాత మైసూరు ఓటర్లు మాత్రం జేడీఎస్‌ను తిరస్కరించి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. తమకు ఎంతో బలంగా ఉన్న మైసూరు ప్రాంతంలో పట్టు కోల్పోయి డీలా పడింది జేడీఎస్. 14 సీట్లకే పరిమితమైంది.