కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే(మే 21) తన వాహన శ్రేణికి ఉన్న జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం 'జీరో ట్రాఫిక్' ప్రోటోకాల్ కారణంగా రోడ్లపై ట్రాఫిక్ స్తంభించి ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్లో వెల్లడించారు.
'శాలువాల బదులు పుస్తకాలు ఇవ్వొచ్చు'
ప్రభుత్వ లేదా పార్టీ కార్యక్రమాల్లో ప్రజలు తనకు గౌరవ సూచకంగా ఇచ్చే పుష్పగుచ్చాలు, శాలువాలను స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ప్రజలు, అభిమానులు తనపై ఉన్న ప్రేమాభిమానాన్ని తెలియజేయాలంటే పుష్పగుచ్చాలు, శాలువాలు బదులు.. పుస్తకాలు ఇవ్వొచ్చని సూచించారు. ప్రజల ప్రేమాభిమానాలు తనపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని సిద్ధరామయ్య అన్నారు.
"బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని నా వాహన శ్రేణికి ఉన్న జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ ఉపసంహరించుకోవాలని బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు తెలియజేశాను. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాపై ప్రజలు ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ప్రభుత్వ, వ్యక్తిగత కార్యక్రమాల్లో అభిమానులు, ప్రజలు తన గౌరవార్థం ఇచ్చే పుష్పగుచ్చాలు, శాలువాల బదులు పుస్తకాలు ఇవ్వొచ్చు."
-సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
Karnataka Election Results : ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి. ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రోజుల పాటు జరిగిన తర్జనభర్జనల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను, డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎంగా నిర్ణయించింది. దీంతో కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య నూతన ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విపక్ష పార్టీల నేతలు సైతం హాజరయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరైన్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సైతం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం ఈ కార్యక్రమానికి గైర్హజరయ్యారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.