కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 65.69శాతం ఓటింగ్ నమోదైంది.
రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరిగింది. శనివారం కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితం వెలువడనుంది.
ఈవీఎంలలో కన్నడ ప్రజల తీర్పు నిక్షిప్తం- శనివారం ఎన్నికల ఫలితం - karnataka elections congress
18:01 May 10
17:41 May 10
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 65.69శాతం పోలింగ్ నమోదైంది.
15:37 May 10
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03శాతం ఓట్లు పోలయ్యాయి.
13:41 May 10
ఒంటిగంట వరకు 37.25 శాతం పోలింగ్
కర్ణాటక ఎన్నికల్లో ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
11:44 May 10
కర్ణాటక ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 20.99 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
11:24 May 10
ఓటు వేసిన మాజీ సీఎం కుమారస్వామి కుటుంబసభ్యులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి కుటుంబసభ్యులతో కలిసి రామనగరలో ఓటు వేశారు. మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ మైసూరులో తన ఓటు హక్కును వినియోగించుకన్నారు.
11:02 May 10
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
10:06 May 10
కేంద్రమంత్రి శోభా కరంద్లాజే బెంగళూరులో ఓటు వేశారు. ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ హుబ్బళ్లిలో ఓటు వేశారు.
09:49 May 10
కర్ణాటక ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 8.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
09:16 May 10
చిక్కమగళూరులో ఓ నవవధువు ఓటు వేసింది. చిక్కబళ్లాపుర్లో అరుదైన సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 65 మంది ఒకేసారి ఓటు వేశారు. ఇప్పటివరకు జరిగిన 15 ఎన్నికల్లో కూడా కుటుంబసభ్యులు అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
08:47 May 10
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గాన్‌లో తన ఓటు హక్కును వినియోగించారు. అంతకుముందు ఆయన హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. "మా పార్టీ ప్రచార సమయంలో ప్రజలు స్పందించిన తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. కర్ణాటక అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి ఓటు వేశారు.
08:11 May 10
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయ్పురలో ఆమె ఓటు వేశారు.
07:42 May 10
ఓటేసిన యుడియారప్ప
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యుడియూరప్ప శిఖరిపురలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతుకుముందు తన కుటుంబసభ్యులతో శ్రీ హుచ్చరాయ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆయన కుమారుడు విజయేంద్ర శిఖరిపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
07:41 May 10
మోదీ ట్వీట్..
కర్ణాటక ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేసేందుకు తరలిరావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కొత్త ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పండుగను సుసంపన్నం చేయాలని కోరారు. మరోవైపు 40 శాతం కమీషన్ ఫ్రీ ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
07:11 May 10
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు ప్రకాశ్‌రాజ్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరులోని శాంతినగర్ జోసెఫ్ స్కూల్లో ఆయన ఓటు వేశారు.
07:11 May 10
అమిత్ షా ట్వీట్..
కర్ణాటకలో సుపరిపాలన, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయడానికి కన్నడ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. "మీ ఓటు రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ప్రజానుకూలమైన ప్రభుత్వాన్ని నిర్ధరిస్తుంది" అని ఆయన ట్వీట్ చేశారు.
06:56 May 10
ప్రధాన పార్టీల అగ్రనాయకుల ప్రచారంతో హోరెత్తిపోయిన కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమైంది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. 5 కోట్ల 31 లక్షలకుపైగా ఓటర్లు.. 2 వేల 615 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న కన్నడ నాట.. ఓటరు మొగ్గు ఎటో ఈనెల 13న తేలిపోనుంది.
06:44 May 10
కర్ణాటకలోని అన్ని పోలింగ్ బూత్‌ల్లో ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు.. పోలింగ్ బూత్‌లకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకుంటున్నారు.
06:11 May 10
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023
Karnataka Assembly Elections 2023 : కర్ణాటకలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. 224 స్థానాలకు బుధవారమే పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. దక్షిణాది రాష్ట్రంలో సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. హంగ్‌పై మరోసారి జేడీఎస్ గంపెడాశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఓటర్లు తన తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేయనున్నారు.
5కోట్ల మంది మన్ననలు ఎవరికో?
కర్ణాటకలో 224 స్థానాలకు గానూ 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5,31,33,054 (5.31 కోట్ల మంది) ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,67,28,053 (2.67 కోట్లు) మంది పురుషులు కాగా.. 2,64,00,074 (2.64 కోట్లు ) మంది స్త్రీలు ఉన్నారు. ఓటింగ్ కోసం 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
224 స్థానాలు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు రావాలి. 2018 ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుతం కన్నడ అసెంబ్లీలో కమలం పార్టీకి 116 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్‌కు 69 మంది, జేడీఎస్‌కు 29 మంది ఉన్నారు. బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
భద్రత కట్టుదిట్టం
పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి స్టేషన్ల కోసం మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. వెబ్‌క్యాస్టింగ్, సీసీటీవీల ద్వారా పోలింగ్ కేంద్రాలను అధికారులు పర్యవేక్షించనున్నారు.
సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?
గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ, అమిత్ షా, నడ్డా వంటి బడా నేతలంతా కర్ణాటక ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు. గతంలో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ.. అధికారంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ నిలవలేకపోయింది. కాబట్టి ఈ సారి ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ దాటాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. స్థానిక అంశాలే ప్రధానంగా ప్రచారాన్ని హోరెత్తించింది.