DK Shivakumar Emotional : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడంపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం పార్టీ కార్యకర్తలు, నేతలకే చెందుతుందన్నారు. తనపై సోనియా చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనని శివకుమార్ తెలిపారు.
"ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. రాష్ట్రస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నేతలు శ్రమించారు. సమష్టి కృషితో ఎన్నికల్లో గెలిచాం. గాంధీ కుటుంబంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. ఈ విజయం పార్టీ శ్రేణులు, నాయకులది. వారు ఎంతో శ్రమించారు. ప్రజలు మాపై విశ్వాసం చూపారు. నాయకులు మాకు మద్దతు ఇచ్చారు. ఇది సమష్టి నాయకత్వం. మేమంతా కలిసి పనిచేశాం. నేను ఆరంభంలో చెప్పాను. మేమంతా కలవటం ఇది ఆరంభమని ఓటువేసిన రోజు చెప్పాను. కలిసి ఆలోచించటమే పురోగతి. కలసి పనిచేయటం విజయమని చెప్పాను. జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవటానికి సోనియా వచ్చిన విషయం నేను మరిచిపోలేను. బీజేపీ నేతలంతా కలిసి నన్ను జైల్లో పెట్టారు" అని డీకే శివకమార్ వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్ కనకపురా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ఆదివారమే సీఎల్పీ మీటింగ్.. సీఎం అభ్యర్థి ఎన్నిక!
ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఆదివారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం బెంగళూరులో జరగనుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రేసులో ముందున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బెంగళూరుకు శనివారం సాయంత్రానికే చేరుకోవాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. అధిష్ఠానం పరిశీలకులను పంపిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై తదుపరి అడుగులు పడతాయని తెలిపారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లే విజయం!: సిద్ధరామయ్య
డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ శ్రమ ఫలించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. "కాంగ్రెస్‌కు చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. రాహుల్ పాదయాత్ర పార్టీకి ఉపకరించింది. బీజేపీ నేతలు ఎన్నికల్లో చాలా ఖర్చు చేశారు. 2018లోనూ ఆపరేషన్ కమలం జరిగింది. డబ్బులిచ్చి నేతలను కొనుగోలు చేశారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరు. ఏ పార్టీ.. దేశాన్ని రక్షిస్తుందో ప్రజలకు తెలుసు" అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇది సెక్యులర్ పార్టీ విజయమని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. 40 శాతం కమీషన్‌పై.. నిజాయతీ గెలిచిందన్నారు. పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.