దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న 'పెగాసస్' హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహా పలువురు ప్రముఖుల ఫోన్ నంబర్లు ఈ స్పైవేర్ లక్షిత జాబితాలో ఉన్నట్లు 'ది వైర్' వార్తా సంస్థ వెల్లడించగా.. తాజాగా మరిన్ని వివరాలను బయటపెట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వానికి చెందిన కొందరు కీలక నేతల ఫోన్ నంబర్లు కూడా టార్గెట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి ఈ హ్యాకింగ్ వ్యవహారానికి సంబంధముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2019 జులైలో కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో భాజపా అధికారంలోకి వచ్చింది. అయితే తాజాగా 'ది వైర్' వెల్లడించిన కథనంలో.. అప్పటి కర్ణాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్య వ్యక్తిగత కార్యదర్శుల ఫోన్ నంబర్లు స్పైవేర్ లక్షిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. వీరితో పాటు కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్ల పైనా నిఘా పెట్టినట్లు తెలిపింది. దీంతో ఈ హ్యాకింగ్ ద్వారానే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఉంటుందనే సందేహాలు వెలువడుతున్నాయి.