Karnakata High Court Warns Facebook : భారత్‌లో ఫేస్‌బుక్ సేవలను నిలిపివేస్తామని కర్ణాటక హైకోర్టు.. ఆ సామాజిక మాధ్యమాన్ని హెచ్చరించింది. సౌదీ అరేబియా జైల్లో ఉన్న భారతీయ వ్యక్తికి సంబంధించిన కేసులో.. స్థానిక పోలీసులకు సహకరించని కారణంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్ణకట్టె ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ క్రిష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఫేస్‌బుక్‌ను హెచ్చరించింది.
కేసు విచారణకు సహకరిస్తూ.. కావాల్సిన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని ఫేస్‌బుక్‌ను హైకోర్టు ఆదేశించింది. అటు మంగళూరు పోలీసులు కూడా సరైన విచారణ చేపట్టి.. నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.
సౌదీ అరేబియాలో అరెస్టయిన శైలేశ్ కుమార్ భార్య కవిత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. "శైలేశ్ కుమార్(52) సౌదీ అరేబియాలోని ఓ సంస్థలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పిల్లలతో కలిసి నేను స్వగ్రామంలోనే ఉంటున్నాను. 2019లో శైలేశ్ కుమార్ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్-ఎన్ఆర్సీకి అనుకూలంగా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఎవరో ఆయన పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచారు. సౌదీ అరేబియా దేశంపై అభ్యంతరకర పోస్టులు చేశారు. ఈ విషయం నా భర్త ద్వారా తెలుసుకున్నాను. వెంటనే నేను మంగళూరు పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని ఫిర్యాదు చేశాను. కానీ ఇంతలోనే సౌదీ పోలీసులు శైలేశ్‌ను అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టారు' అని హైకోర్టులో వేసిన పిటిషన్లో కవిత పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన మంగళూరు పోలీసులు.. ఫేక్ అకౌంట్ గురించి తగిన సమాచారం ఇవ్వాల్సిందిగా ఫేస్‌బుక్‌కు లేఖ రాశారు. కానీ పోలీసులకు.. ఫేస్‌బుక్ సహకరించలేదు. దీంతో పిటిషనర్ కవిత.. విచారణలో అలసత్వం వహిస్తున్నారంటూ 2021లో హైకోర్టు ఆశ్రయించారు. తన భర్తను జైలు నుంచి విడిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సైతం ఉత్తరం రాసినట్టు కవిత వెల్లడించారు.
ఫేస్‌బుక్ డేటా అక్రమ బదిలీ.. మెటాకు భారీ జరిమానా..
ఇటీవల ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు రికార్డు స్థాయిలో జరిమానా పడింది. ఈయూ యూజర్లకు చెందిన ఫేస్‌బుక్ డేటాను.. అమెరికాలోని సర్వర్లకు అక్రమంగా బదిలీ చేసిందని నిర్ధరిస్తూ ఐరోపా సమాఖ్య మెటాకు ఫైన్ విధించింది. ఈ కేసులో 130 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ సోమవారం ఆ జరిమానాకు చెందిన ప్రకటన విడుదల చేసింది. ఈయూ యూజర్ల డేటాను నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు బదిలీ చేసినట్లు ఆరోపించింది. దీన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.