శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పటికీ కొందరు.. అనుకున్న రంగంలో రాణించలేరు. కానీ పట్టుదల, సాధించాలన్న కసి ఉంటే.. అంధత్వం కూడా అడ్డంకి కాదని నిరూపించాడు కర్ణాటకకు చెందిన సుమిత్. పుట్టుకతోనే అంధుడైన సుమిత్.. తన అంగవైకల్యానికే సవాల్ విసురుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఎవరి సహాయం లేకుండా సులభంగా కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు. ఇంతకీ అతడి కథేంటంటే?
కర్ణాటక బెళగావిలోని గోకక్ ప్రాంతానికి చెందిన సుమిత్ మోతేకర్ పుట్టుకతోనే అంధుడు. చిన్నప్పటి నుంచి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ.. కష్టపడి చదివాడు. తన అంగవైకల్యాన్ని సాకుగా చూపకుండా పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. చివరకు పట్టుదలతో ప్రయత్నించి 2021లో బెళగావి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆరోగ్య విభాగంలో కొలువు సాధించాడు. చూపు లేకపోయినా.. ఎవరి సహాయం లేకుండా కంప్యూటర్ను ఆపరేట్ చేస్తున్నాడు. తన వృత్తిలోని అడ్డంకులను సమర్థంగా ఎదుర్కొంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు సుమిత్.
సుమిత్ 'నాన్ డెస్క్‌టాప్ విజువల్ ఎక్సెల్' అనే అప్లికేషన్‌ను ఉపయోగించి.. కంప్యూటర్ను ఆపరేట్ చేస్తాడు. ఎవరైనా అధికారులు సుమిత్‌కు ఫోన్ చేస్తే.. అతడు 'టాక్ బ్యాక్' యాప్ సహాయంతో ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకొని స్పందిస్తాడు. ఈ యాప్ ద్వారా ఎవరి సహాయం లేకుండానే వారి నెంబర్లు కూడా సేవ్ చేసుకోవచ్చని చెబుతున్నాడు. ఆఫీస్ లెటర్లు టైప్ చేయడం.. ఆన్లైన్ అప్డేట్ వర్క్లాంటి ఇతర కార్యాలయ పనులన్నీ సుమిత్ సులభంగా చేస్తున్నాడు. ఈ కొలువు కోసం సుమిత్.. కంప్యూటర్ అడ్వాన్స్ కోర్సులో ఆరు నెలల పాటు అడ్వాన్స్ ఎక్సెల్, అడ్వాన్స్ ఎంఎస్‌తో పాటు ఎవరి సహాయం లేకుండా సులభంగా పని చేయడానికి శిక్షణ తీసుకున్నాడు.
"నా పేరు సుమిత్ మోతేకర్. నేను బెళగావి మున్సిపల్ కార్పొరేషన్లో సెకండ్ డివిజన్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాను. బెంగళూరులో ఆరు నెలలు కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇంతకుముందు హైదరాబాద్‌లో పనిచేశాను. ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ రాగానే అక్కడ ఉద్యోగం మానేశాను. ఇక్కడ ఆఫీస్‌లో సహోద్యోగులు కూడా నాకు సపోర్ట్‌గా ఉంటారు. నా ఇళ్లు కూడా ఈ ఆఫీస్ వెనకాలే ఉంటుంది. ఎవరి సహాయం లేకుండా రోజు నేను ఒక్కడినే ఆఫీస్‌కు వస్తాను. NVD అనే కంప్యూటర్ స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ ద్వారా నేను టైపింగ్ చేస్తాను. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో పని చేయగలుగుతున్నాను."