Kannada Name Board Protest : వాణిజ్య వ్యాపార సంస్థల నామఫలకాల్లో 60 శాతం కన్నడ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి బృహత్ బెంగళూరు మహానగర పాలిక మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కన్నడలో నామఫలకాలకు సంబంధించి బెంగళూరు మహానగర పాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండు చేస్తూ కన్నడ రక్షణ వేదికే కార్యకర్తలు బెంగళూరులో ర్యాలీ చేపట్టారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్, లావెల్లే రోడ్, UB సిటీ, చామరాజపేట, చిక్‌పేట్, కెంపెగౌడ రోడ్, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. కొన్ని వ్యాపార సంస్థలు కావాలనే కన్నడ భాషను నిర్లక్ష్యం చేస్తున్నాయని కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో నగరంలోని హోటళ్లు, పలు దుకాణాల బయట ఆంగ్లంలో ఉన్న బోర్డులను కొందరు నిరసనకారులు ధ్వంసం చేశారు. మరికొన్ని షాపుల పేర్లపై నల్లరంగు చల్లారు. ఆందోళనకారుల చర్యలను అడ్డుకున్న పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.
Kannada Name Board Issue : కన్నడ రక్షణ వేదికే ఆందోళనలతో బహుళజాతి సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాము ఇచ్చిన ఆదేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వస్తాయని బృహత్ బెంగళూరు మహానగర సంస్థ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ చెప్పారు. వాటిని పాటించకుంటే దుకాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణాల లైసెన్సును రద్దు కూడా చేస్తామని పేర్కొన్నారు. దుకాణాల సైన్ బోర్డులు మార్చుకోవడానికి మరో రెండు నెలలు గడువు ఉన్నప్పటికీ కన్నడ రక్షణ వేదిక ఇప్పుడు ఆందోళనలకు దిగింది.