Kannada Name Board Issue : కర్ణాటకలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాల నామఫలకాల్లో 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. 60 శాతం కన్నడ అక్షరాలు, 40 శాతం ఇతర భాషాల అక్షరాలతో నామఫలకాలు ఉండేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్డినెన్స్ సంబంధించిన నియమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 28లోగా అన్ని కంపెనీలు, సంస్థలు, ఇతర దుకాణాలు తమ నేమ్‌ప్లేట్‌లను మార్చుకోవాలని సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులంతా వీటిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
భాష పరిరక్షణ పేరిట విధ్వంసాన్ని ఉపేక్షించం: డీకే శివకుమార్
కన్నడ పరిరక్షణ పేరిట ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఉపేక్షించబోమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు. రాష్ట్ర భాషను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
"కన్నడ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికి మేం వ్యతిరేకం కాదు. వారిని గౌరవిస్తాం. కానీ, విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం కళ్లు మూసుకోదు. వారు నిరసన వ్యక్తం చేయవచ్చు. కానీ, ఆస్తులకు నష్టం కలిగించడం ఆమోదయోగ్యం కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తున్నారు. ప్రజలు తమ జీవనోపాధి కోసం ఇక్కడ నివసిస్తున్నారు. ఈ పరిణామాలు వారిలో భయాందోళనలు కలిగించకూడదు. కన్నడ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. అధికారిక కార్యకలాపాలు రాష్ట్ర భాషలోనే ఉండాలని ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ఆదేశించారు. 60 శాతం కన్నడ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. దీన్ని ఉల్లంఘించినవారికి నోటీసులు జారీ చేయడం వంటి మార్గాలు ఉన్నాయి"
--డీకే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి