Kamal Haasan Lok Sabha Seat :దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన భేటీలో పాల్గొన్న కమల్ హాసన్.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూసి బీజేపీ సర్కారు ఓర్వలేకపోతోందని అన్నారు. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తాను బాధపడలేదని చెప్పారు.
"త్వరలోనే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యేగా గెలవకపోయినా నేను దృఢంగా ముందుకెళ్లా. అప్పుడు నా ముఖంపై బాధ కూడా లేదు. ఈ వయసులో రాజకీయాల్లోకి వచ్చినందుకు నేను క్షమాపణ చెబుతున్నా. కరుణానిధి అప్పట్లోనే నన్ను డీఎంకేలో చేరాలని ఆహ్వానించారు. అప్పుడే నేను కాంగ్రెస్‌లోనో, కమ్యూనిస్ట్ పార్టీలోనో చేరతా అని చెప్పాల్సింది."
-కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అధినేత
హిందీ భాషపైనా కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని పూర్తిగా వ్యతిరేకించాలని తాను అనడం లేదని చెప్పారు. 'తమిళంలో జీవించమనే మేం కోరుతున్నాం. హిందీ మాత్రమే మాట్లాడాలని అంటే.. మేం వ్యతిరేకిస్తాం' అని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రమంతటికీ మంచి నాయకత్వం అవసరం ఉందని అన్నారు. పెరియార్ ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఆయన తమిళనాడు అంతటికీ సొంతమని అన్నారు. 'దేవుడు లేడు అని చెప్పడం పెరియార్ ఉద్దేశం కాదు. ఆయన తన చివరి శ్వాస వరకు సమాజం కోసం జీవించారు. డీఎంకే గానీ, మరే ఇతర పార్టీ గానీ పెరియార్‌ను తమకు చెందిన వ్యక్తిగా చెప్పుకోవడం సరికాదు' అని కమల్ చెప్పుకొచ్చారు.