బార్ కౌన్సిల్ నుంచే తమ మూలాలు మొదలయ్యాయని భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా(cji of india) విధులు నిర్వహిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ(cji nv ramana) అన్నారు. బార్ కౌన్సిల్‌తో(bar council of india) తనకు ఎనలేని అనుబంధం ఉందని వెల్లడించారు. ఖర్చులు, విచారణలో జాప్యం న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్ అని అన్నారు. వాటిని అధిగమించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
సీజేఐగా బాధ్యతలు చేపట్టినందుకు జస్టిస్ రమణను అభినందిస్తూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది. దిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. జస్టిస్ రమణకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సన్మానించారు.
న్యాయవిద్యలో నాణ్యత కోసం తపన, న్యాయవాద వృత్తిపై నిబద్ధత.. జస్టిస్ రమణ సీజేఐ కాకముందు, అయిన తర్వాత ఆయన ప్రసంగాల్లో ఎప్పుడూ ప్రతిబింబిస్తూనే ఉందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ప్రశంసించారు. జస్టిస్ రమణ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారని ఆయనను కలిసిన తర్వాత అర్థమైనట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశంలోని దిగువ కోర్టుల్లో సామాన్యులకు న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోందని తెలిపిన కేంద్ర మంత్రి.. సత్వర న్యాయం జరిగేలా సీజేఐ దృష్టి పెట్టాలని కోరారు.