Amit Shah Manipur Visit : మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితులపై విచారణకు త్వరలోనే విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా విచారణ చేపడుతుందని చెప్పారు. దీంతో పాటు మణిపుర్ గవర్నర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి సహా అన్ని పార్టీలు, ఇరు తెగల సభ్యులతో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
మణిపుర్‌లో నాలుగు రోజుల పర్యటనను ముగించుకున్న అమిత్ షా.. గురువారం ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం చర్చలే ఈ సమస్యకు పరిష్కారమని షా తేల్చిచెప్పారు. మయన్మార్-మణిపుర్ సరిహద్దును సురక్షితంగా ఉంచుతామని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. బంద్‌లు, కర్ఫ్యూలు లేకుండా పోయాయని తెలిపారు.
"మణిపుర్‌లోని అనేక పునరావాస కేంద్రాలను సందర్శించాను. కుకీ, మెయిటీ తెగలకు చెందిన సంఘాలతో శాంతి నెలకొనేలా చూడాలని చర్చించాను. శాంతి కారణంగా ఏర్పడిన నవయుగం మణిపుర్‌లో ఆరేళ్ల నుంచి కొనసాగుతోంది. కోర్టు తీర్పు కారణంగా, కొంత అపార్థం చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మణిపుర్ ప్రజలు సహృద్భావంతో చర్చలు జరిపి ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తెస్తారని మేము విశ్వసిస్తున్నాం. మేము "సూ" గ్రూపు వారికి కఠిన హెచ్చరిక జారీచేస్తున్నాం. సూ ఒప్పందాన్ని ఏ రకంగానైనా ఉల్లంఘించినా, ఒప్పందం నుంచి తప్పుకున్నా నిబంధనలు ఉల్లఘించినట్లే. ఒప్పందంలోని అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఈ అంశాన్ని మేము కఠినంగా పర్యవేక్షిస్తాం. ఆయుధాలు కలిగి ఉన్న వారు.. వాటిని పోలీసులకు అప్పగించాలని కోరుతున్నాను. శుక్రవారం నుంచి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. తర్వాత ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. మణిపుర్-మయన్మార్ సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం కంచె వేయడమే. దీనిని ఇరు దేశాలు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది."
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి