వచ్చే ఏడాది జో బైడెన్ అధ్యక్షుడిగా అగ్రరాజ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడం కష్టసాధ్యమేమీ కాదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జై శంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ భారత దేశానికేమీ కొత్త కాదని ఆయన వివరించారు.
ఓ ఆన్‌లైన్ సమావేశంలో జై శంకర్ మాట్లాడుతూ.. 2000లో బిల్ క్లింటన్ అధికారంలో ఉన్నప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని, దానిలో బైడెన్ భాగస్వామ్యం కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను భారత రాయబారిగా ఉన్నానని జై శంకర్ తెలిపారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. అంతకు ముందు సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యుడిగా, ఆ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ ఆయనతో కలసి పనిచేశామని జైశంకర్ వెల్లడించారు.