తాము చెప్పిన వ్యక్తితో వివాహానికి నిరాకరించడమే కాకుండా.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్నకూతురు బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించారు తల్లితండ్రులు. ఈ అమానుష ఘటన ఝార్ఖండ్లో జరిగింది. సమీప బంధువైన రాజ్‌దీప్ కుమార్‌తో గత రెండేళ్లుగా తమ కూతురు సహజీవనం చేస్తోందని.. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. ఎంత చెప్పినా వినకపోవడ వల్ల ఆగ్రహించి ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు.
కూతురు వివాహాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం కూతురు బొమ్మ తయారు చేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆచారాల ప్రకారం బొమ్మకు దహన సంస్కారాలు పూర్తి చేశారు.
ఝార్ఖండ్ ఛత్రా జిల్లా తాండవ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సుఖ్దేవ్ రామ్ కుమార్తె సబితా అలియాస్ కిరణ్ కుమారి (25) నాలుగు నెలల క్రితం సమీప బంధువైన రాజ్‌దీప్ కుమార్‌ను వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదని వారు తెలిపారు.