Jammu Kashmir Encounter : జమ్ముకశ్మీర్.. కుప్వారాలోని జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచల్ సెక్టార్‌లోని కాలా అడవిలో పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ముష్కరులను మట్టుబెట్టారు. శుక్రవారం జరిగిందీ ఎన్కౌంటర్.
కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. దీంతో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ముష్కరుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు తెలిపారు.
ఐదుగురు ఉగ్రవాదులు హతం..
జూన్ 16న జమ్ముకశ్మీర్.. కుప్వారాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నియంత్రణ రేఖ సమీపంలో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇంకా ముష్కరుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇద్దరు ముష్కరులు హతం..
జూన్ 8న జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాల్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇద్దరు సాయుధులను మట్టుబెట్టాయి. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. బాలాకోట్ సరిహద్దు వెంబడి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తం అయిన సైన్యం.. ఓపెన్ ఫైర్ చేసిందని అధికారులు తెలిపారు. అనంతరం ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టిందని వెల్లడించారు. ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. వారి వద్ద నుంచి రెండు ఏకే అసాల్ట్ రైఫిల్స్, ఓ శక్తిమంతమైన ఐఈడీ బాంబ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కొన్నాళ్ల క్రితం జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. జైనాపోరా ప్రాంతంలోని ముంజ్మార్గ్లో ఉగ్రవాదులున్నట్లు.. భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే సైన్యం, పోలీసులు కలిసి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. సైన్యం కూడా ముష్కరులపై ఎదురుదాడి చేయగా.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. వారినుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్ పురాణ కృష్ణ భట్‌ను చంపడంలో వీరికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.