Jammu And Kashmir Election Supreme Court : జమ్ముకశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వంసుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘంపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలియజేశారు. జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. తొలుత పంచాయతీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని తెలిపారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Article 370 Hearing Update : అయితే జమ్ముకశ్మీర్‌లో ఓటర్ల జాబితాను అప్డేట్ చేసే పని జరుగుతోందని.. అది పూర్తి కావడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుందని సుప్రీంకు మెహతా తెలిపారు. దీంతో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు (Jammu Kashmir Statehood Restoration) కొంత సమయం పడుతుందని తెలియజేశారు. లద్దాఖ్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, లేహ్‌లో ఎన్నికలు ముగిశాయని.. ఇక వచ్చే నెలలో కార్గిల్‌లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. జమ్మకశ్మీర్‌లో 2018తో పోలిస్తే ఇప్పటి వరకు తీవ్రవాద సంబంధిత సంఘటనలు 45.2 శాతం తగ్గాయని.. చొరబాటు యత్నాలు 90.2% తక్కువయ్యాయని సుప్రీంకోర్టుకు నివేదించారు.
కేంద్రం సమర్పించిన ఉగ్రవాద సంబంధింత ఘటనల డేటాను సుప్రీం రికార్డు చేయడంపై.. పటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ డేటా అధికరణ 370 సమస్య విచారణను ప్రభావితం చేయదని ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హామీ ఇచ్చారు.