Jammu Kashmir coldest night: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లో.. ఈ చలికాలంలోనే అత్యంత తక్కువగా మైనస్ 6.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం మైనస్ 2.2 డిగ్రీలు, బుధవారం మైనస్ 3.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ 4.5 డిగ్రీలుగా నమోదైందని అధికారులు గుర్తు చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్ రిసార్ట్‌లో మైనస్ 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత్ర నమోదైంది. లోయలో అత్యంత చల్లని ప్రాంతం రిసార్టే కావడం విశేషం. పహల్గామ్ జిల్లాలోని అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంపు వద్ద మైనస్ 8.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హిమాచల్‌లో..
హిమాచల్‌ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. కిన్నౌర్ జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా అధికారులు వాహనాల రాకపోకలను రద్దు చేశారు. నెసాంగ్, హాంగ్‌రాంగ్ వ్యాలీ ప్రాంతాలు 10 అంగుళాల మేర మంచుతో నిండిపోయినట్లు అధికారులు తెలిపారు. మంచుతో నిండిన ప్రాంతాలను చూసి పర్యటకులు మురిసిపోతున్నారు.