జూన్ 27వ తేదీ రాత్రి వాయుసేన స్థావరంపై దాడి జరిపిన వారు జమ్మూ నుంచే డ్రోన్లు ఎగురవేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక సండేగార్డియన్ పేర్కొంది. పేలుడు పదార్థాలతో రెండు డ్రోన్లు జమ్ము వాయుసేన స్థావరంపై దాడి చేశాయి. ఇదే విషయాన్ని గతంలో ఓ దర్యాప్తు సంస్థ కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు నివేదికను సమర్పించింది. ఈ నివేదిక హోంశాఖకు చేరింది. దీనిపై ఎన్‌ఐఏ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున ఎటువంటి సమాచారం ఇవ్వలేమని తెలిపారు.
పాకిస్థాన్‌కు ఈ వాయుసేన స్థావరం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థావరంలోని హ్యాంగర్ల (విమానాలు, హెలికాప్టర్లను భద్రపర్చే గోదామువంటివి) వద్ద పేలుడు పదార్థాలను జారవిడిచాయి. ఎంఐ17 హెలికాప్టర్లను, రవాణా విమానాలను ఈ ప్రదేశాలకు అత్యంత సమీపంలో భద్రపరుస్తుంటారు. తొలుత ఈ డ్రోన్లు పాక్ నుంచి వచ్చినట్లు అనుమానించారు. కానీ, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ అవి స్థానికంగా ఉన్న వ్యక్తులే వినియోగించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ డ్రోన్లు వాయుసేన స్థావరానికి సమీపం నుంచే ఎగురవేసినట్లు అంచనా వేస్తున్నారు.