ప్రపంచ ప్రసిద్ధి జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి జరిగింది. పోటీల్లో పాల్గొన్న ఓ వ్యక్తి మృతిచెందాడు. పలువురు గాయాలపాలయ్యారు. తమిళనాడులోని మదురై.. పాలమేడు ప్రాంతంలో పెద్దఎత్తున జరిగిన జల్లికట్టు పోటీల్లో అరవింద్ అనే యువకుడు పాల్గొని బలయ్యాడు. అరవింద్.. ఐదు రౌండ్లలో తొమ్మిది ఎద్దులను అదుపు చేసి మూడో స్థానంలో నిలిచాడు. కానీ, ఇంతలోనే ఓ ఎద్దు అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న వైద్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరవింద్ మృతిచెందాడు.
పోటీ చూడడానికి వెళ్లి ఇద్దరు బలి..
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జల్లికట్టు పోటీలు చూడడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కొనగలవల్లి ప్రాంతంలో జరిగిన పోటీలు చూడడానికి లోకేశ్ అనే 32 ఏళ్ల యువకుడు వెళ్లాడు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన ఓ ఎద్దు లోకేశ్ ఛాతిపై బలంగా ఢీకొట్టింది. దీంతో లోకేశ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడు లోకేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎద్దుల పోటీల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి భార్య చంద్రమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ పోటీల్లో మరో 8 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
మరో ఘటనలో షికారిపుర ప్రాంతానికి చెందిన రంగనాథ్ అనే 23 ఏళ్ల యువకుడు జనవరి 14న మలూరు గ్రామంలో జరిగిన జల్లికట్టు పోటీలు చూసేందుకు వెళ్లాడు. అక్కడ రంగనాథ్‌కు ఓ ఎద్దు ఢీట్టింది. దీంతో చికిత్స పొందుతూ రంగనాథ్ ఆదివారం ప్రాణాలు విడిచాడు.