ఒడిశా బ్రహ్మపుర్కు చెందిన ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులు అద్భుతాన్ని సృష్టించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో రోబో ప్రతిమను తయారు చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై (e-waste management in india) ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ మేరకు చేసినట్లు తెలిపారు. ఇందుకు బ్రహ్మపుర్ మున్సిపల్ కార్పొరేషన్ సేకరించిన 3 టన్నుల ఈ-వ్యర్థాలను వినియోగించినట్లు వెల్లడించారు. దాదాపు 30 అడుగుల ఎత్తు ఉన్న రోబోను తయారు చేశారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ-వేస్ట్ ప్రతిమ (big robot statue in india) కావడం విశేషం.
"ఈ రోబో ప్రతిమను తయారు చేయడానికి మూడు నెలల సమయం పట్టింది. దాదాపు 40 మంది విద్యార్థులం శ్రమించాం. కరోనా లాక్డౌన్ సమయాన్ని ఇలా వినియోగించాము. మూడు టన్నుల వ్యర్థాలతో 30 అడుగుల ఎత్తుగల రోబోను తయారు చేశాము. ఈ-వ్యర్థాలైన కాపర్, లిథియం, పాదరసం, నికెల్, సిలీనియం, ఆర్సెనిక్, బేరియం వంటివి వాతావరణాన్ని భారీ స్థాయిలో కాలుష్యం చేస్తాయి. ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ రోబోను తయారు చేశాం."