తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానంలో మహిళ హల్​చల్​.. బట్టలు విప్పేసి, సిబ్బందిని కొట్టి.. - ఎయిర్ ఇండియా శంకర్ మిశ్రా కేసు

విమానంలో ఓ మహిళ నానా హంగామా చేసింది. సిబ్బందిపై దాడి చేసి, అనంతరం విమానంలో అర్ధ నగ్నంగా నడిచింది. అబుదాబి-ముంబయి విమానంలో ఈ ఘటన జరిగింది.

vistara flight
విమానంలో మహిళ హల్​చల్​.. బట్టలు విప్పేసి, సిబ్బందిని కొట్టి..

By

Published : Jan 31, 2023, 3:01 PM IST

Updated : Jan 31, 2023, 4:16 PM IST

ఇటలీకి చెందిన ఓ మహిళ అబుదాబి-ముంబయి విమానంలో అనుచితంగా ప్రవర్తించింది. ఒంటి మీద ఉన్న కొన్ని బట్టలు తీసేసి, విమానంలో హల్​చల్​ చేసింది. పావోలా పెర్రుక్సియో అనే మహిళ ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకుని బిజినెస్ క్లాస్‌లో కూర్చోవాలని పట్టుబట్టింది. అందుకు విమాన సిబ్బంది నిరాకరించారు. దీంతో సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం విమానంలో అర్ధ నగ్నంగా నడిచింది.

అబుదాబి నుంచి ముంబయి వస్తున్న విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పావోలా పెర్రుక్సియో మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఈ విమానం ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. "మా సిబ్బందితో ప్రయాణికురాలు మర్యాద లేకుండా మాట్లాడారు. మా సిబ్బందికి, మిగతా ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారు. దీంతో వారి భద్రతకు భంగం వాటిల్లింది." అని విస్తారా ప్రతినిధి తెలిపారు. ప్రయాణికురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

విస్తారా ఎయిర్​లైన్స్​ ఫిర్యాదును స్వీకరించిన ముంబయిలోని సహారా పోలీసులు.. పావోలా పెర్రుక్సియోపై కేసు నమోదు చేసుకున్నారు. విమానం ల్యాండ్​ అయిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సదరు మహిళ బెయిల్​పై విడుదలైంది. గత కొద్ది రోజులు అంతర్జాతీయ విమానాలలో అనుచిత ఘటనలు జరుగుతున్న కారణంగా.. ఇలాంటి విషయాల్లో విమాన సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

జనవరి 24న ఇలాంచి ఘటనకే పాల్పడ్డాడు ఓ ప్రయాణికుడు. దిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విమాన సిబ్బందిని వేధించాడు. దీంతో స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఆ వ్యక్తితోపాటు ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని విమానం నుంచి దించేసింది. అనంతరం వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్రం పోసిన ఘటన..
గత ఏడాది నవంబరు 26న శంకర్​ మిశ్రా అనే వ్యక్తి.. మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్రం పోశాడు. న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగింది. భోజనం తర్వాత విమానంలో లైట్లు ఆర్పేసిన సమయంలో మహిళ సీటు దగ్గరకు వెళ్లి ఆమెపై మూత్రం పోశాడు. దీంతో ఆ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ప్రయాణికుడి చర్య కారణంగా తన దుస్తులు, బ్యాగు తడిచిపోయాయని తెలిపింది. దీంతో సిబ్బంది ఆమెకు మరో జత దుస్తులు, స్లిప్పర్స్‌ ఇచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎయిర్​ ఇండియా సంస్థ. అనంతరం శంకర్​ మిశ్రాపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు.

అలాంటిదే మరో ఘటన..
పారిస్- దిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తప్పతాగిన ఓ ప్రయాణికుడు.. మహిళ దుప్పటిపై మూత్రం పోశాడు. ఈ ఘటన డిసెంబరు 6న జరిగింది. అనంతరం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Jan 31, 2023, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details