IT raids Samajwadi party: దేశంలో మరో భారీ జీఎస్టీ మోసం బట్టబయలైంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన పీయూష్ జైన్ అనే పర్ఫ్యూమ్ వ్యాపారి తప్పుడు బిల్లులతో పాల్పడిన భారీ పన్ను ఎగవేతను జీఎస్టీ, ఐటీ అధికారులు బయటపెట్టారు. నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడి పీయూష్ కూడబెట్టిన దాదాపు రూ.150 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. గురువారం దాడులు నిర్వహించిన అధికారులు శుక్రవారం ఉదయం వరకు లెక్కించి ఆ డబ్బు విలువను రూ.150 కోట్లుగా తేల్చారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు వివరించారు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సీబీఐసీ) ఛైర్మన్ వివేక్ జోహ్రి.
సీబీఐసీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బయటపడటం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. వ్యాపారవేత్త పీయూష్ జైన్‌కు చెందిన త్రిమూర్తి ఫ్రాగ్రెన్స్కు సంబంధించి వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. శిఖర్ పాన్ మసాలా కంపెనీ యజమాని ప్రవీణ్ జైన్‌కు చెందిన పలుచోట్ల కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది.
పాన్ మసాలా, త్రిమూర్తి కంపెనీ గుట్కా తయారుచేసి ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా పన్ను కట్టకుండా ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారని అధికారులు చెప్పారు.
పీయూష్ జైన్ ఇంట్లో మూడు నోట్ల లెక్కింపు యంత్రాలను కూడా అధికారులు గుర్తించారు. ఆయన నోట్ల కట్టలను రెండు బీరువాల్లో నిండా పేర్చారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. పీయూష్ ఇంట్లోనే కుప్పలుగా పోసి లెక్కించారు. ఆ నోట్లను తరలించేందుకు పదుల సంఖ్యలో భారీ పెట్టెలను కూడా సిద్ధం చేశారు.
అధికారుల అదుపులో పీయూష్ కుమారుడు..