IT Raids On DMK MP Jagathrakshakan : కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్కు సంబంధించిన స్థలాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఇంటితో పాటు విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఇతర ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నారు.అనేక కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ఎంపీ.. నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదన్న ఆరోపణలతో ఐటీ శాఖ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Tamil Nadu IT Raids :మొత్తం 40 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అడయార్‌లోని ఎంపీ ఇంటితో పాటు, తంబరం ప్రాంతంలోని భరత్ యూనివర్సిటీ కాలేజ్, పల్లవరంలోని వేలా ఆస్పత్రి, పల్లికరనై బాలాజీ మెడికల్ కాలేజ్, పూంతమల్లి సవిత ఆస్పత్రి, టీనగర్‌లోని నక్షత్ర ఇన్ హోటల్లోనూ అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తనిఖీల నేపథ్యంలో భద్రత కోసం వెయ్యి మందికి పైగా సాయుధ పోలీసులను రంగంలోకి దించారు.
డీఎంకేలో వివిధ హోదాల్లో పనిచేశారు జగత్రక్షకన్. కేంద్ర ఐటీ, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అరక్కోణం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
Senthil Balaji Case :ఇటీవల తమిళనాడు మరో మంత్రి సెంథిల్ బాలాజీకి చెందిన ప్రాంతాల్లోనూ ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. మంత్రితో సంబంధం ఉన్నాయని భావిస్తున్న కాంట్రాక్టర్ల నివాసాలు, ఆఫీసులపైనా దాడులు చేపట్టింది. సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు. సెంథిల్ బాలాజీ ఈడీ కేసును సైతం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది.