ISRO successfully launches first scientific satellite XPoSat: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ‘ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం’తో సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లి విజయవంతమైంది. నిన్న ఉదయం 8:10 గంటలకు ప్రారంభమై 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్‌ఎల్‌వీ-సీ58 లో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ (XPoSat) ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగించిన అనంతరం 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరింది. ఈ ప్రయోగం సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
రేపు పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు
ఎక్స్-రే మూలాలను అన్వేషించడం: ఎక్స్‌పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం చేసినట్లు వెల్లడించారు. ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలతో పాటుగా స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు.
ఈ తరహ ప్రయోగం చేయడం ఇది రెండోవదని, కొత్త ఏడాది కొత్త విజయాన్ని అందుకున్నామని సోమనాథ్ తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి నాలుగు టెస్టు ప్రయోగాలు చేయాల్సి ఉందన్నారు. గగన్‌యాన్ మ్యాన్ మిషన్ 2025లో జరుగుతుందన్నారు. నాసా, ఇస్రో సంయుక్తంగా చేయబోయే GSLV-ఇన్ శాట్3డీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. మరో జీఎస్ఎల్వీ ద్వారా నావిక్ ఉపగ్రహం నింగిలోకి పంపుతామన్నారు. 2024లో నెలకో ప్రయోగం ఉంటుందని సోమనాథ్ వెల్లడించారు. ఆదిత్యాలో అమర్చిన 9ప్యాలోడ్స్ పని చేస్తున్నాయన్నారు.