రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి' భారత్ చేరుకోవడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్పుత్నిక్ టీకాలు మే చివరి నాటికి భారత్ చేరుకునే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. దీంతో భారత్‌లో టీకా పంపిణీని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమని నిపుణులు భావిస్తున్నారు.
'రష్యా నుంచి స్పుత్నిక్ టీకా తొలి బ్యాచ్‌ను ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మే నెల చివరినాటికి వీటిని దిగుమతి చేసుకునేందుకు మావంతు ప్రయత్నాలు చేస్తున్నాం' అని భారత్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించింది. అంతేకాకుండా స్పుత్నిక్ టీకా తయారీని భారత్‌లో మరికొన్ని నెలల్లోనే ప్రారంభిస్తామని తెలిపింది. భారత్‌లో తయారయ్యే స్పుత్నిక్ టీకా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అందుబాటులోకి రావొచ్చని ఆశిస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ నెలలోనే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమవుతుందని రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ గతవారం వెల్లడించారు. అయినప్పటికీ టీకా దిగుమతి ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యం అవుతున్నట్లు తెలుస్తోంది.