కేరళతో పాటు యావద్దేశంలోఅందరి దృష్టిని ఆకర్షించిన శబరిమల వివాదం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతోంది? రెండేళ్లకిందటి ఈ వివాదాన్ని కేరళ ఓటర్లు పట్టించుకుంటున్నారా? భాజపా దీన్నుంచి లబ్ధి పొందుతుందా?
2019లో జరిగిన శబరిమల వివాదం ఈసారి ఎన్నికల ప్రచారంలో పెద్దగా పైకి విన్పించట్లేదు. కేరళలో కాళ్లూనాలని ప్రయత్నిస్తున్న భాజపా కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది లేదు. కానీ ఉన్నట్టుండి అధికార ఎల్‌డీఎఫ్ కూటమి మంత్రి, ముఖ్యమంత్రి విజయన్‌కు అత్యంత సన్నిహితుడైన సురేంద్రన్ ఈ అంశాన్ని ఇటీవలే ప్రచారంలో ప్రస్తావించడం వల్ల శబరిమల ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. రెండేళ్ల కిందట జరిగిన శబరిమల సంఘటనలకు సురేంద్రన్ క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
అప్పుడేమైంది?
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం.. పోలీసుల భద్రత మధ్య ఇద్దరు మహిళలను శబరిమల ఆలయంలోకి వామపక్ష కూటమి ప్రభుత్వం పంపింది. దీంతో కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందువుల మనోభావాలను కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం కించపరుస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్, భాజపా రెండూ విజయన్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు సంధించాయి. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కమ్యూనిస్టు కూటమి దారుణంగా ఓడిపోయింది. భాజపాకు పెద్దగా లాభం చేకూరకున్నా, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి అత్యధిక సీట్లను గెల్చుకుంది.
కామ్రేడ్ల ఉపశమన చర్యలు..
హిందూ ఓట్లు తమకు పడటం లేదని గుర్తించిన వామపక్ష కూటమి ఆ తర్వాత వారిని ప్రసన్నం చేసుకోవటానికి ఇంటింటికీ తిరిగి ఎలాంటి పరిస్థితుల్లో శబరిమలలోకి మహిళలను పంపాలనే నిర్ణయం తీసుకుందో వివరించే ప్రయత్నం చేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ శబరిమల వివాదం నిశ్శబ్దంగా తమకు నష్టం చేకూరుస్తుందేమోననే అనుమానం వామపక్ష కూటమిలో కనిపిస్తోంది. అందుకే సురేంద్రన్ ప్రత్యేకంగా శబరిమల విషయాన్ని ప్రస్తావించి తప్పైందని అంగీకరించారు. "రెండేళ్ల నాటి సంఘటనలు చాలా బాధాకరం. మా ప్రభుత్వం అలా చేసి ఉండాల్సింది కాదేమో! ఇకమీదట సుప్రీం తుది తీర్పు తర్వాత.. భక్తులు, సంఘాలు, అన్ని పార్టీలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం" అని ఆయన వ్యాఖ్యానించారు.
మరి ఈసారి?
శబరిమల వివాదంలో ముందుండి నడిపిస్తున్న నాయర్ సేవా సమితిని ప్రసన్నం చేసుకోవటానికి కాంగ్రెస్, భాజపా శ్రమిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నాయర్ వర్గం ఫలితాలను ప్రభావితం చేసే స్థితిలో ఉంది. ముఖ్యంగా కజకూటమ్ (22శాతం), కొన్ని (28శాతం), త్రిశూర్ (16.7 శాతం)లో! మిగిలిన నియోజకవర్గాల్లోనూ శబరిమల వివాదాన్ని, ఆ సందర్భంగా వామపక్ష కూటమి అనుసరించిన విధానాన్ని కాంగ్రెస్, భాజపాలు ప్రజలకు గుర్తు చేస్తున్నాయి. అందుకే.. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఎల్‌డీఎఫ్ మంత్రి సురేంద్రన్ శబరిమల వివాదంపై క్షమాపణలు చెప్పారు. సీపీఎం అధిష్ఠానం ఈ ప్రకటనతో విభేదించినా.. ముఖ్యమంత్రి విజయన్ మాత్రం సురేంద్రన్ చెప్పిన క్షమాపణలను సమర్థించడం గమనార్హం!
ఇదీ చూడండి:'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?