కరోనా బాధితులకు దిల్లీలో విస్తృతంగా సేవలందిస్తున్న అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ను దిల్లీ పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. కొవిడ్ మందుల పంపిణీపై వచ్చిన ఆరోపణల ఆధారంగా పోలీసులు.. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆయన్ను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
కొవిడ్ చికిత్సకు సంబంధించిన మందులను కొన్ని రాజకీయపార్టీల నేతలు చట్టవిరుద్ధంగా పంపిణీ చేస్తున్నారని పేర్కొంటూ దిల్లీ హైకోర్టులో దాఖలైన కేసు ఆధారంగా శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని మే 4న.. దిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.