అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సోమవారం దిల్లీ ఆందోళనల్లో మహిళా రైతులు కీలక పాత్ర పోషించనున్నారు. రైతులు, విద్యార్థినులు, కార్యకర్తలు.. ఇలా వేలాది మంది మహిళలు సింఘు, టిక్రీ, గాజీపూర్ నిరసనల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం.. పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్(పశ్చిమ) రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున మహిళా కర్షకులు తరలివస్తున్నట్టు రైతు సంఘం నాయకులు తెలిపారు. మహిళలే అన్నీ తామై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని.. ఆ రోజును వారికే అంకితమిస్తున్నట్టు స్పష్టం చేశారు.
దేశీయ వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు రైతు ఉద్యమంలో మహిళా దినోత్సవం రోజు వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో మహిళల ప్రసంగం అనంతరం.. సింఘు సరిహద్దులో చిన్న తరహా కవాతు నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే.. వీటిపై ఇంకా స్పష్టత రాలేదు.