నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న విపక్షాల వైఖరిని మోసం, రాజకీయ ద్రోహంగా అభివర్ణించారు. దశాబ్దాలుగా ప్రజలకు అందని ప్రయోజనాల్ని కల్పించే క్రమంలో క్లిష్టమైన, పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
'ఏదైనా రాజకీయ పార్టీ తాము చేసిన హామీలను నెరవేర్చనప్పుడు.. వాటిని ఇతర పార్టీలు నెరవేరిస్తే.. వాటిని అవసరం లేనివిగా, అసహ్యకరమైనవిగా మార్చి ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తాయి' అని అన్నారు మోదీ. ఈ మేరకు ఓపెన్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"వ్యవసాయంలో సంస్కరణల కోసం తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారిని చూస్తే.. నిజాయితీ లేమి, రాజకీయ మోసం అనే పదాలకు అసలైన అర్థం కనిపిస్తుంది. మేం తీసుకువచ్చిన ఈ చట్టాలను తీసుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రులకు ఒకప్పుడు వీరే లేఖలు రాశారు. వీరే తాము అధికారంలోకి వస్తే ఈ సంస్కరణలను తీసుకువస్తామని తమ మేనిఫెస్టోల్లోనూ హామీలిచ్చారు. కానీ, ఇప్పుడు వేరే రాజకీయ పార్టీ వాటిని అమల్లోకి తేవడం వల్ల వారు దానిపై యూటర్న్ తీసుకున్నారు. అందుకే వాటిని వ్యతిరేకిస్తూ.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు."
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.