చైనాతో సరిహద్దులు కలిగిన అరుణాచల్ ప్రదేశ్‌లో శరవేగంగా రోడ్లు, టెలికం వంటి మౌలిక వసతుల అభివృద్ధి, హైటెక్ సాధనాలు, ఆయుధ వ్యవస్థల సమీకరణతో మంచి జోరు మీదున్న భారత సైన్యం ఇప్పుడు సమీకృత పోరాట బృందాలు (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్-ఐబీజీ)గా ఏర్పడటంపై దృష్టిపెట్టింది. దీనివల్ల ఈ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల్లో యుద్ధరీతులే మారిపోతాయి. ఇక్కడ మన సైన్యం చేపడుతున్న మార్పుల్లో ఐబీజీలు ప్రధానాంశంగా ఉన్నాయి. ఈ దిశగా 2019లో 'హిమవిజయ్' పేరుతో నిర్వహించిన వినూత్న సైనిక విన్యాసాల్లో నేర్చుకున్న పాఠాలను ఆచరణలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఏమిటీ ఐబీజీలు?
Integrated battle groups Indian army : బ్రిగేడ్ స్థాయి (3,500- 4వేల మంది సైనికులు) కన్నా ఐబీజీలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇందులో పదాతి, శతఘ్ని, ట్యాంకు, గగనతల రక్షణ దళాలు, పోరాట హెలికాప్టర్లు, ఇతర తోడ్పాటు విభాగాలు ఉంటాయి. గతంలో భారీ దాడి దళాలు (స్ట్రైక్ కోర్‌లు) యుద్ధరంగంలో ముందుండి పోరాటాలు సాగించేవి. వాటికన్నా తక్కువ సంఖ్యలో ఉండే ఐబీజీలు చాలా చురుగ్గా కదులుతాయి. వాటిలో అన్ని విభాగాలకు చెందిన బలగాలు ఉండటం వల్ల అవి స్వయం సమృద్ధంగా ఉంటాయి. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో శత్రుభూభాగంలోకి మెరుపువేగంతో ఒడుపుగా దూసుకెళ్లగలవు. దేశ పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో ఐబీజీలు త్వరలోనే ఏర్పాటుకానున్నట్లు నాటి సైన్యాధిపతి జనరల్ నరవణె ఈ ఏడాది జనవరిలో ప్రకటించడం ఇక్కడ ప్రస్తావనార్హం.
ఎం777- చినూక్ ద్వయం
అత్యంత తేలికపాటి ఎం777 శతఘ్నులను శరవేగంగా నిర్దేశిత ప్రాంతంలో మోహరించడం ఐబీజీ వ్యూహాల్లో కీలకం. ఈ ఆయుధాలను శక్తిమంతమైన చినూక్ హెలికాప్టర్లు తమ దిగువభాగంలో మోసుకెళతాయి. భారత వాయుసేన వద్ద ప్రస్తుతం 15 చినూక్‌లు ఉన్నాయి. ఈ తరగతికి చెందిన మరో 11 హెలికాప్టర్లను సమకూర్చుకునే ప్రతిపాదనలు ఉన్నాయి.