ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ విమానవాహక నౌక సాగర ప్రవేశం చేయడం భారత నౌకాదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శత్రువు కంటపడకుండా సముద్ర జలాల్లో సంచరించే స్టెల్త్ జలాంతర్గాములపై ఆసక్తి ఉన్నప్పటికీ కనీసం మూడు విమానవాహక నౌకలను కలిగి ఉండాలన్న ఆకాంక్ష ఈ దళంలో ఎక్కువగా ఉంది. దీన్ని సాకారం చేసుకోవాలని గట్టిగా భావిస్తోంది.
ప్రస్తుతం భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య అనే విమానవాహక నౌక ఒకటే సేవలు అందిస్తోంది. దీన్ని రష్యా నుంచి మన దేశం కొనుగోలు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తాజాగా 37,500 టన్నుల బరువైన స్వదేశీ విమాన వాహక నౌక (ఐఏసీ-1) సిద్ధమైంది. కొచ్చిన్ షిప్‌యార్డ్ నుంచి నాలుగు రోజుల సాగర పరీక్షల కోసం అరేబియా సముద్రంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. నౌకాదళంలో చేరాక దీనికి ఐఎన్‌ఎస్ విక్రాంత్ అని నామకరణం చేస్తారు. 2023లో అది సాకారం కావొచ్చు.
ఏం పరీక్షిస్తారు?
సముద్ర జలాల్లో (ఐఏసీ-1)కు ప్రధానంగా 'డ్రాట్' పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఈ భారీ నౌక సురక్షితంగా ప్రయాణించడానికి అవసరమైన లోతును నిర్ధరిస్తారు. ఇది దాదాపు 30 మీటర్లు ఉండొచ్చని అంచనా. లంగరు వేసినప్పుడు నౌక ఎంత స్థిరంగా ఉంటుందన్నదీ పరిశీలించనున్నారు. అలాగే స్టీరింగ్, ఎలక్ట్రానిక్ సాధనాల సత్తా, ఇంజిన్ ఏకబిగిన ఎంతసేపు పనిచేయగలదు, నౌక వేగం వంటివి పరీక్షించనున్నారు. ఈ యుద్ధనౌక నేవీలో చేరాకే.. దీని డెక్ నుంచి ఆయుధాలతో కూడిన యుద్ధవిమానాలు, హెలికాప్టర్ల టేకాఫ్, ల్యాండింగ్ పరీక్షలు నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.