కరోనా మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయిన కార్యక్రమాలు.. ఒక్కొక్కటిగా తిరిగి మొదలవుతున్నాయి. ఇందులో మిలిటరీ యుద్ధ విన్యాసాలు ఒకటి. 2020లో ఆగిపోయిన ద్వైపాక్షిక సైనిక విన్యాసాలను పునరుద్ధరించేందుకు భారత సైన్యం ప్రణాళికలు రచిస్తోంది. మధ్య ఆసియాపై దృష్టి సారిస్తూ ఈ ప్రక్రియ సాగిస్తోంది.
ఇందులో భాగంగా తొలుత 'దస్త్లిక్-2' విన్యాసాలు జరగనున్నాయి. దీని కోసం ఉజ్బెకిస్థాన్ సైనికులు సోమవారం దిల్లీలో దిగారు. ఈ బృందానికి ఇద్దరు కర్నల్లు నేతృత్వం వహిస్తుండగా.. మేజర్-జనరల్ పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో.. భారత్‌లోని ఉజ్బెక్ రాయబారి కూడా పాల్గొనే అవకాశముంది.
భారత్‌లో దిగిన ఉజ్బెక్ బృందం ఉత్తరాఖండ్‌లోని చౌబతియా ప్రాంతంలో.. ఈ నెల 10 నుంచి 19 వరకు దస్త్లిక్-2 విన్యాసాలు జరగనున్నాయి. సముద్రమట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఆ ప్రాంతం ఉండటం విశేషం.
భారత సైన్యం నుంచి 13 కుమౌన్ బృందం ఇందులో పాల్గొంటోంది. ఇది స్ట్రైక్ కార్ప్స్లో భాగం. ధైర్యసాహసాలకు ఈ బృందం పెట్టింది పేరు. తూర్పు లద్దాఖ్‌లో అత్యంత కీలకమైన రేజాంగ్ లా పర్వత మార్గాన్ని.. 1962 యుద్ధంలో చైనా చేతికి చిక్కకుండా అడ్డుకుంది ఈ బృందమే.
2021లో దస్త్లిక్-2 ఆరంభం మాత్రమే. మంగోలియా, క్రిజిస్థాన్, కజకిస్థాన్‌తో ఇప్పటికే మిలిటరీ విన్యాసాల కోసం ప్రణాళికలు పూర్తయ్యాయి.
ఈ దేశాలు చైనాకు సరిహద్దుల్లో ఉండటం గమనార్హం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
మధ్య ఆసియా- అఫ్గానిస్థాన్‌లో భారత సైనిక-దౌత్య బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. అయితే వీటి నిర్వహణకు 5 లక్ష్యాలు ఉన్నాయి. అవి...
- భద్రత, అనుసంధానతలో.. ఆయా దేశాలతో ఇప్పటికే ఉన్న బంధాన్ని మెరుగుపరుచుకోవడం.
- మధ్య ఆసియా ప్రాంతంలోకి ప్రవేశించి.. అఫ్గానిస్థాన్‌లో భారత ప్రభావాన్ని పెంచడం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ తాలిబన్- ప్రభుత్వం మధ్య అస్థిరత నెలకొంది. ఆయుధాలు, సామగ్రి, ఇతర సేవలతో ప్రభుత్వానికి గత కొన్నేళ్లుగా భారత్ అండగా నిలిస్తోంది.
- ఇరాన్‌తో బంధాన్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు వెతకడం. వాస్తవానికి ఇరాన్ భారత్‌కు మిత్రదేశమే. కానీ కొంత కాలంగా ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది.
- ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం. చైనా చేపట్టిన బీఆర్ఐ(బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్)కు కౌంటర్ వేయడం.
- మధ్య ఆసియా దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం. ఫలితంగా.. ఆయా దేశాల్లోని చమురు, గ్యాస్, ఖనిజాల వనరులు పొందడం.
(రచయిత- సంజీవ్ బారువా)