తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అగ్రరాజ్యం కంటే ఎక్కువగా ఆ దేశానికే మన విద్యార్థులు'

'మా వాడు అమెరికా వెళ్లాడు' ఏ నోట విన్నా ఈ మాటే వినేవాళ్లం. కానీ ఇకపై అమెరికా స్థానాన్ని మరోదేశం భర్తీ చేయనుంది. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించాయి కేంద్ర ప్రభుత్వ గణాంకాలు. మరి ఆ దేశం ఏది?. ఎందుకు భారతీయ విద్యార్థులు అక్కడకు వెళ్తున్నారో తెలుసుకోండి.

indian students in canada
కెనడాకే మన విద్యార్థులు

By

Published : Jul 27, 2021, 5:03 AM IST

Updated : Jul 27, 2021, 6:39 AM IST

విదేశీ చదువులకు భారతీయ విద్యార్థుల తొలి గమ్యస్థానం ఏది? అని అడిగితే అమెరికా అని ఠక్కున సమాధానం ఇవ్వకండి. ఇప్పుడు ఆ స్థానాన్ని కెనడా ఆక్రమించింది మరి.. కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు అదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకూ అమెరికాలో భారతీయ విద్యార్థులు 2,11,930 మంది ఉండగా.. కెనడాలో ఆ సంఖ్య 2,15,720గా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో 11.33 లక్షల మంది భారతీయులు చదువుకుంటున్నారు.

ఎందుకీ మార్పు..?

విదేశీ చదువంటే అమెరికానే అనే భావన నుంచి భారతీయ విద్యార్థులు బయటపడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. వాస్తవానికి అమెరికాలో చైనా తర్వాత అత్యధిక మంది విదేశీ విద్యార్థులు మనవారే. ఆ దేశానికి 2017లో అధ్యక్షుడిగా ట్రంప్‌ రావడంతోనే భారతీయ విద్యార్థుల అభిప్రాయంలో మార్పు రావడం మొదలైంది. మన దేశ విద్యార్థులపై అక్కడి పోలీసుల నిఘా, వీసాల జారీ కఠినతరం చేయడం, హెచ్‌1బీ వీసాలు లాంటి వాటిల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టే ఆలోచనలు చేయడం తదితర కారణాలతో విద్యార్థులు కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల వైపు మొగ్గుచూపారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలు దేశాలు విదేశీ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా ఆ దేశాలు భారత్‌పై దృష్టి పెట్టాయి. కెనడా అయితే వీసాల జారీని సులభతరం చేసింది. ఒక్క ఏడాది కోర్సుకు కూడా రెండేళ్ల వర్క్‌ పర్మిట్‌ ఇస్తోంది. రెండేళ్ల పీజీ కోర్సుకు మూడేళ్లపాటు వర్క్‌ పర్మిట్‌ జారీ చేస్తున్నారు. ఆ దేశంలో శాశ్వత స్థిర నివాసం(పర్మినెంట్‌ రెసిడెంట్‌) కోసం దరఖాస్తు చేసుకున్న రెండు, మూడేళ్లలోనే వస్తోంది. ఆ అనుభవంతో సిటిజన్‌షిప్‌( ఆ దేశ పౌరసత్వం) కోసం దరఖాస్తు చేసుకుంటే అయిదేళ్లలో ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం తొలి నాలుగు నెలల్లో లక్ష వీసాలిచ్చామని దిల్లీలోని కెనడా హైకమిషన్‌ తెలిపింది.

కెనడా వైపు చూస్తున్నారు

"బ్రిటన్‌ తరహాలోనే కెనడాలోనూ ఒక్క ఏడాదిలో మాస్టర్‌ విద్య పూర్తిచేసి రెండేళ్లపాటు కొలువు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమెరికా కంటే 30 శాతం వరకు ఫీజులు, ఖర్చులు తక్కువగా ఉంటాయి. గుజరాత్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల నుంచి చాలా మంది డిప్లొమా కోర్సులు చేయడానికి కూడా వెళ్తున్నారు. టూరిజం, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఎక్కువగా చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా గత మూడు నాలుగేళ్ల నుంచి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి వీసాలు ఇస్తున్నా.. ట్రావెల్‌ నిషేధం మరికొద్ది రోజులపాటు ఉండనుంది. త్వరలోనే దాన్ని తొలగించే అవకాశం ఉంది."అని ఐఎంఎఫ్‌ఎస్‌ కన్సల్టెన్సీ సంచాలకుడు వేములపాటి అజయ్‌కుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండి:'చెక్​మేట్'తో భారత్‌ను ఆకట్టుకునే యత్నాల్లో రష్యా!

నీటి లోపల మహిళ అద్భుత నృత్య ప్రదర్శన

Last Updated : Jul 27, 2021, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details