తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలు ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. 25 శాతం మేర తగ్గనున్న ఛార్జీలు!

Railway Fare Reduced : రైలు ప్రయాణికులకు గుడ్​న్యూస్​. త్వరలో వందే భారత్​ సహా అన్ని రైళ్ల ఏసీ ఛైర్​కార్​, ఎగ్జిక్యూటివ్​ తరగతుల ఛార్జీలు 25 శాతం మేర తగ్గనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటించింది.

indian railway reduced fare charges of all trains up to 25 percent
indian railway reduced fare charges of all trains up to 25 percent

By

Published : Jul 8, 2023, 2:31 PM IST

Updated : Jul 8, 2023, 3:43 PM IST

Railway Fare Reduced : రైలు ప్రయాణికులకు భారతీయ​ రైల్వే తీపి కబురు చెప్పింది. త్వరలో వందే భారత్​ సహా అన్ని రైళ్ల ఏసీ ఛైర్​కార్​, ఎగ్జిక్యూటివ్​ తరగతులతో పాటు అనుభూతి, విస్టాడోమ్ కోచ్​లు ఉన్నవాటికి ఆక్యుపెన్సీని బట్టి ఛార్జీలు 25 శాతం మేర తగ్గనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా గత 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఈ మేరకు ఛార్జీలు తగ్గించాలని రైల్వే జోన్​లకు సూచించింది. ఈ తగ్గిన ధరలు వెంటనే అందుబాటులోకి వస్తాయని.. ఇదివరకే టికెట్​ బుక్​ చేసుకున్నవారికి రిఫండ్​ లభించదని తెలిపింది. డిస్కౌంట్‌ అనేది బేసిక్‌ ఫేర్‌లో గరిష్ఠంగా 25 శాతం వరకు ఇవ్వనున్నారు.

రిజర్వేషన్‌, సూపర్‌ ఫాస్ట్‌ సర్‌ఛార్జి, జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు మాత్రం అదనంగా వర్తిస్తాయి. డిస్కౌంట్‌ నిర్ణయించే ముందు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆక్యుపెన్సీని బట్టి రైలు ప్రయాణించే మొత్తం దూరానికి, లేదా ఎంపిక చేసిన స్టేషన్ల మధ్య కూడా ప్రయాణానికి డిస్కౌంట్‌ వర్తింపజేయొచ్చని తెలిపింది. హాలిడే, ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లకు ఈ స్కీమ్‌ వర్తించదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

అందుబాటులోకి వందేభారత్​ రైళ్లు
దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్లు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. శనివారం ప్రధాని మోదీ ప్రారంభించిన గోరఖ్​పుర్- లఖ్​నవూ, జోధ్​పుర్- సబర్మతీ రైళ్లతో కలిపి వివిధ రాష్ట్రాల్లో వందే భారత్​ రైళ్ల సంఖ్య 25 చేరింది. మరికొన్ని రైళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రధాన రూట్లలో ఈ రైళ్లను నడుపుతున్నారు. కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ.. మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్‌ ధరలు అధికంగా ఉన్న కారణంగా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఎండలు తగ్గి వర్షాలు కూడా పడుతుండడంతో ఏసీ బోగీల్లో.. ముఖ్యంగా ఛైర్‌కార్లలో ప్రయాణానికి ఆశించిన మేర ప్రయాణికుల నుంచి డిమాండ్‌ ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు కొత్త పథకంతో ముందుకొచ్చింది.

దేశంలో టాప్‌ ఆక్యుపెన్సీ రూట్లు ఇవే..
ఆక్యుపెన్సీ విషయంలో కాసర్‌గోడ్‌-త్రివేండ్రం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్రస్థానంలో ఉంది. 183 శాతం ఆక్యుపెన్సీతో అన్ని రైళ్ల కంటే ముందుంది. త్రివేండ్రం- కాసర్‌గోడ్‌ (176 శాతం), గాంధీనగర్‌- ముంబయి సెంట్రల్‌ (134 శాతం), ముంబయి సెంట్రల్‌ - గాంధీనగర్‌ (129 శాతం), వారణాశి - న్యూదిల్లీ (128 శాతం), న్యూదిల్లీ - వారణాశి (124 శాతం), దేహ్రదూన్‌- అమృత్‌సర్ (105 శాతం), ముంబయి- షోలాపూర్‌ (111 శాతం), షోలాపూర్‌- ముంబయి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (104 శాతం) ఆక్యుపెన్సీ పరంగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక స్టేషన్‌ నుంచి ఒక స్టేషన్‌కు తీసుకునే టికెట్‌ను ఒక బుకింగ్‌గా, అక్కడి నుంచి మరో స్టేషన్‌ వరకు టికెట్‌ జారీ అయితే రెండో బుకింగ్‌గా లెక్కిస్తారు.

Last Updated : Jul 8, 2023, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details