తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లా చేస్తున్నావ్‌.. పెళ్లొద్దా అనేవాళ్లు' - భారత ప్రధాన న్యాయమూర్తి

తాను డిగ్రీ చేసేటప్పుడు.. 'ఎందుకు లా చదువుతున్నావు? పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా? అని అడిగేవారు' అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. ఏ ఉద్యోగం రాకే న్యాయశాస్త్రాన్ని ఎంచుకున్నట్లు భావించేవాళ్లని పేర్కొన్నారు. 'సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ లా ఫర్మ్స్‌ కాఫీ టేబుల్‌' బుక్‌ విడుదల కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Chief Justice of India, N V Ramana
భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

By

Published : Aug 5, 2021, 7:02 AM IST

న్యాయశాస్త్ర పట్టా సులభంగా అందుకున్నా దాని ద్వారా జీవనోపాధి పొందడం ఒకప్పుడు చాలా సవాల్‌తో కూడుకొని ఉండేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. బుధవారం సాయంత్రం 'సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ లా ఫర్మ్స్‌ కాఫీ టేబుల్‌' బుక్‌ విడుదల కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.

"నేను డిగ్రీ చేసేటప్పుడైతే.. ఎందుకు లా చదువుతున్నావు? ఎక్కడా మరే ఉద్యోగమూ రాలేదా? పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా? అని అడిగేవారు. తొలితరం న్యాయవాదులకు కోర్టులో స్థిరమైన ప్రాక్టీస్‌ అన్నది కలగా ఉండేది. అందుకే దాన్ని చివరి ప్రయత్నంగా భావించేవారు. ఇక్కడ నా వ్యక్తిగత అనుభవంతో మాట్లాడుతున్నా. వనరుల కొరత కారణంగా మాలాంటి చాలామంది.. ప్రాక్టీస్‌ సమయంలోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నారు."

- జస్టిస్​, ఎన్​వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి

న్యాయసంస్థలు మరింత చేరువ కావాలి

"దేశంలో వాణిజ్యావకాశాలు వృద్ధి చెందడంతో పెట్టుబడులు పెరిగాయి. కార్పొరేట్‌ చట్టాల్లో నిపుణత కలిగిన న్యాయవాదులకు డిమాండ్‌ పెరిగింది. భారతీయ న్యాయసంస్థలు మరింత మందికి చేరువ కావాలి. ఇవి కేవలం ధనవంతులకే పరిమితమనే అభిప్రాయం ఉంది. న్యాయసంస్థల కార్యకలాపాలతో సమాజానికి ఏమీ సంబంధం ఉండదన్న అపోహ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేసే న్యాయవాదుల్లోనూ ఉంది. ఈ అభిప్రాయాన్ని తొలగించుకోవాలి. న్యాయ సంస్థలు పెద్ద నగరాల్లోని విశ్వవిద్యాలయాలకు చెందినవారికే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులకు, మహిళా న్యాయవాదులకూ ఎక్కువ అవకాశం కల్పించాలి" అని జస్టిస్‌ రమణ చెప్పారు.

ఇదీ చూడండి:సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ల ఫోన్లపైనా నిఘా!

ABOUT THE AUTHOR

...view details