బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఇటీవల సీఎం మమతా బెనర్జీ గాయపడి ఆస్పత్రిలో చేరడం, సువేందు అధికారి, మమత మధ్య నందిగ్రామ్‌లో జరగబోయే రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ నందిగ్రామ్ వెళ్లారు. భాజపాకు ఓటేయొద్దని ప్రజల్ని కోరారు.
"కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు ఓటువేయకండి. మీ రాష్ట్రాన్ని రక్షించుకోండి. వారు(భాజపా) మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగితే.. పంటకు మద్ధతు ధర ఎప్పుడు ప్రకటిస్తారు? ధాన్యానికి రూ.1850 ధర ఎప్పుడు వస్తుంది? అని అడగండి."-రాకేశ్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు.
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఇటీవల రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టికాయత్ శనివారం కోల్‌కతా చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ (మహా పంచాయత్)లో పాల్గొన్నారు. అక్కడి నుంచి నందిగ్రామ్ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. అంతకు ముందు తృణమూల్ నేతలతో సంభాషించారు.