తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​- చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ

By

Published : Jan 25, 2021, 11:49 AM IST

Updated : Jan 25, 2021, 12:48 PM IST

INDIA
భారత్​- చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ!

11:47 January 25

భారత్​-చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ

తూర్పు లద్దాఖ్‌ వివాదంతో భారత్‌, చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతుండగానే వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్‌, చైనా జవాన్లు ఘర్షణకు దిగాయి. 

నకులా వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) బలగాలు ప్రయత్నించాయి. వీరిని భారత బలగాలు అడ్డుకొన్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీఎల్‌ఏ సైనికులను భారత బలగాలు వెనక్కి పంపాయి. ఈ ఘర్షణల్లో ఇరు దేశాల వైపు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది.

చిన్న గొడవే..

నకులా వద్ద ఈ నెల 20న చైనా సైనికులతో చిన్నపాటి ఘర్షణ జరిగిందని భారత సైన్యం స్పష్టం చేసింది. అయితే స్థానిక కమాండర్ స్థాయి చర్చలతోనే సమస్య పరిష్కారమైనట్లు పేర్కొంది. 

కాగా.. తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనపై రెండు దేశాల మధ్య తొమ్మిదో విడత‌ చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటుచేసుకోవడం గమనార్హం. లద్దాఖ్‌ అంశంపై ఆదివారం భారత్‌, చైనా సైనిక ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నిన్న ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు కొనసాగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బలగాల తగ్గింపు తొలి బాధ్యత చైనాదేనని భారత బృందం మరోసారి స్పష్టం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 

అయితే ఓవైపు ఈ చర్చలు జరుగుతుండగానే లద్దాఖ్‌లో డ్రాగన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడింది. లద్దాఖ్‌ సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచింది. దీనికి భారత్‌ కూడా దీటుగా ప్రతిస్పందిస్తోంది.

Last Updated : Jan 25, 2021, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details