దేశంలో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించింది భారత్. ఈ మేరకు ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ. అలాంటి చర్యలు కొనసాగితే.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
" ఈరోజు కెనడా హైకమిషనర్‌కు సమన్లు జారీ చేశాం. భారతీయ రైతులకు సంబంధించిన సమస్యలపై కెనడా ప్రధాని, కొందరు కేబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదని తెలియజేశాం. కెనడా నాయకులు చేసిన వ్యాఖ్యలు.. అక్కడి భారత హైకమిషన్, కాన్సులేట్ ముందు ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీసే ప్రమాదం ఉంది. దాంతో భద్రత సమస్యలు తలెత్తుతాయి. భారతీయ హైకమిషన్ అధికారులకు కెనడా ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుందని భావిస్తున్నాం. ఉగ్రకార్యకలాపాలను రెచ్చగొట్టే చర్యలకు వారి రాజకీయ నేతలు దూరంగా ఉండాలి."