భారత్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన నివేదిక తీవ్ర భయాందోళనలు.. కలిగించేదిగా ఉంది. భారత్‌లో శీతలీకరణ రంగంలో పెట్టుబడుల అవకాశాల పేరుతో ప్రపంచ బ్యాంక్ నివేదిక విడుదల చేసింది. గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతుండగా.. వడగాల్పులు ప్రమాదకర స్థాయిలో వీస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ హెచ్చరించింది. భారత్‌లో వేలాది మరణాలకు కారణమైన వడగాల్పులు భయంకరమైన స్థాయిలో పెరుగుతాయని వెల్లడించింది. మానవ మనుగడ ప్రమాదంలో పడేంత స్థాయికి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు రికార్డు స్థాయిలో నమోదయ్యే మొదటి దేశాల్లో.. భారత్ ఒకటిగా మారుతుందని హెచ్చరించింది.
'భారత్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. రికార్డు స్థాయిలో వడగాలులు.. ఇలా అయితే కష్టమే!' - భారత్‌లో వడగాల్పులు
భారత్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన నివేదిక కలకలం రేపుతోంది. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. అవి ప్రమాదకరస్థాయికి పెరిగే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ హెచ్చరించింది. భవిష్యత్తులో భారత్‌లో మానవ మనుగడ ప్రమాదంలో పడే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది ఈ హెచ్చరికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
భవిష్యత్తులో భారత్‌లో వచ్చే ఉష్ణోగ్రతలు అధిక స్థాయిల్లో ఉంటాయని.. అవి చాలాకాలం కొనసాగుతాయని ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. 2022 ఏప్రిల్‌లోనూ భారత్‌లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన విషయాన్ని గుర్తు చేసింది. ఆ సమయంలో దిల్లీలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్న ప్రపంచబ్యాంక్.. ఈ సారి ఇవి అసాధారణరీతిలో పెరుగుతాయని స్పష్టం చేసింది. భారత్‌లో వడగాల్పులు మానవ మనుగడ పరిమితిని విచ్ఛిన్నం చేయగలవని అంచనా వేసిన నివేదిక.. దక్షిణాసియా అంతటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై శాస్త్రవేత్తలు.. ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలను గుర్తు చేసింది.
విపరీతంగా పెరుగుతున్న కర్బన ఉద్గారాల వల్ల 2036-65 నాటికి.. భారత్‌లో హీట్‌వేవ్స్ 25 రెట్లు ఎక్కువగా కొనసాగుతాయని.. జీ20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ 2021లో హెచ్చరించింది. భారత్‌లో పెరుగతున్న అధిక వేడి.. ఆర్థిక ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీస్తుందని కూడా ప్రపంచబ్యాంక్ నివేదిక హెచ్చరించింది. దేశంలోని శ్రామికశక్తిలో 75 శాతం మంది బహిర్గత శ్రమపై ఆధారపడి ఉంటారని.. అధిక ఉష్ణోగ్రతలు వారికి ప్రాణాంతకం కావచ్చని నివేదిక పేర్కొంది. భారత్‌లో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. శీతలీకరణ పరికరాలకు డిమాండ్ పెరుగుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. జనాభాలో మూడింట రెండు వంతుల మంది రోజువారి సంపాదన 160 రూపాయల కంటే తక్కువ ఉన్న నేపథ్యంలో ఏసీల ధర తగ్గవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ ICAP నివేదిక ప్రకారం భారత్‌లో కేవలం ఎనిమిది శాతం జనాభా వద్ద మాత్రమే ఏసీలు ఉన్నాయి.