PM Modi speech: సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మంత్రంతోనే గత 8 ఏళ్ల పాలనలో గొప్ప పురోగతి సాధించినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. స్థిరత్వం, సహకారం, సులభతర వాణిజ్య విధానంపైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఇన్వెస్టర్ల మూడో సదస్సును ప్రారంభించిన అనంతరం ఈ మేరకు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, తయారీ, పునరుత్పాదక శక్తి, ఎంఎస్ఎంఈ, ఫార్మా, పర్యటకం, రక్షణ, వాయుమార్గం, వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన 1,406 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. వీటి విలువ రూ.80,000కోట్లు. 21 శతాబ్దంలో భారత అభివృద్ధికి యూపీనే ఊతమిస్తుందని అన్నారు. వచ్చే పదేళ్లు దేశానికి ఛోదక శక్తిగా యూపీనే ఉంటుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
'భారత శక్తి సామర్థ్యాలను చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. జీ-20 దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే. గ్లోబల్ రిటైల్ ఇండెక్స్‌లో భారత్‌ది రెండో స్థానం. ఉత్తర్‌ప్రదేశ్‌లో గంగానది 1100కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. 25-30జిల్లాల నుంచి వెళ్తోంది సహజ వ్యవసాయ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్‌ను యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ ప్రపంచానికి ఇదే సువర్ణావకాశం'