కరోనా రెండో దశ కోరల్లో చిక్కుకుని విలవిలాడిన భారత్ ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతోంది. మరోవైపు.. కొత్త వేరియంట్ల విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే మూడో దశ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆ భయానక విలయంలో భారత్ చిక్కుకోకూడదంటే అందరికీ సాధ్యమైనంత త్వరగా టీకా అందించాల్సిన అవసరం ఉంది. అయితే.. 2021 డిసెంబర్ నాటికి దేశంలో వయోజనుల(18 ఏళ్లు దాటిన వారు) అందరికీ టీకా అందిస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పింది. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కేంద్రం విజయం సాధించేనా?
టీకా వేగం ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే.. డిసెంబర్ నాటికి వయోజనులందరికీ టీకా పంపిణీ చేయాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు టీకాలతో పాటు మరిన్ని టీకాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో ప్రజల్లో టీకా పట్ల ఉన్న అనుమానాలను తొలగించాలని సూచిస్తున్నారు.
"వయోజనులందరికీ డిసెంబర్ నాటికి టీకా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రోజుకు కోటి చొప్పున టీకా డోసులు పంపిణీ చేయాలి. మరిన్ని టీకాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలు.. టీకా తీసుకునేలా ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అయినప్పటికీ.. చాలా మందిలో ఇంకా వ్యాక్సిన్లపై అపోహలు ఉన్నాయి. వాటిని కూడా తొలగించి అందరినీ టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది."
-గిరిధర్ జ్ఞాని, అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్(ఏహెచ్‌సీపీ)- డైరెక్టర్ జనరల్
జూన్ 21 నుంచి టీకా పంపిణీ ప్రక్రియలో కేంద్రం మార్పులు తీసుకువచ్చింది. అప్పటి నుంచి దేశంలో రోజుకు సగటున 40 లక్షల టీకా డోసుల పంపిణీ జరుగుతోంది. అయితే.. ఈ టీకా విధానాన్ని తీసుకువచ్చిన మొదటి రోజున గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో 88 లక్షల టీకా డోసులను పంపిణీ చేశారు.
మాట మార్చిన కేంద్రం!
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలను పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38.5 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు.. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య పంపిణీ చేసేందుకు 216 కోట్ల డోసులను తాము సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మే నెలలో తెలిపింది. అయితే.. నెలరోజుల తర్వాత.. 135 కోట్ల టీకా డోసులను మాత్రమే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య పంపిణీ చేసేందుకు తాము సేకరిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదించింది. ఇది మే నెలలో కేంద్రం చెప్పిన దానికంటే 80 కోట్ల డోసులు తక్కువగా ఉండటం గమనార్హం.
" నిర్దేశిత లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోవాలంటే మరిన్ని అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. టీకా లభ్యత, వాటి ఉత్పత్తి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. సాధ్యమైనంత త్వరగా ఇతర టీకాలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలి. జాన్సన్ అండ్ జాన్సన్, జైడస్ క్యాడిలా టీకాలకు త్వరలోనే భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తాయి. "
-గిరిధర్ జ్ఞాని, ఏహెచ్‌సీపీ డైరెక్టర్ జనరల్
'ఉత్పత్తి పెరగాలి'