తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాల్దీవులు రాయబారికి భారత్ సమన్లు- లక్షద్వీప్ వ్యవహారంపై అసహనం!

India Maldives Issue : లక్షద్వీప్ విషయంపై మాల్దీవులు డిప్యూటీ మంత్రులు అక్కసు వెళ్లగక్కడంపై ఆ దేశ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా, భారత్​పై తమ మంత్రులు విమర్శలు చేయడాన్ని మాల్దీవులు ఎంపీలు తప్పుబట్టారు.

India Maldives Issue
India Maldives Issue

By PTI

Published : Jan 8, 2024, 10:54 AM IST

Updated : Jan 8, 2024, 12:00 PM IST

India Maldives Issue :ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కసు వెళ్లగక్కడంపై ఆ దేశ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా, భారత్​లోని మాల్దీవులు హైకమిషనర్ ఇబ్రహీం షాహీబ్ సోమవారం ఉదయం విదేశాంగ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత కార్యాలయం నుంచి బయటకు రావడం కనిపించింది.

విదేశాంగ కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్న ఇబ్రహీం షాహీబ్

భారత్‌పై ముగ్గురు మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కసు వెళ్లగక్కడంపై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. విదేశీ నాయకులు, ముఖ్యంగా సన్నిహితమైన దేశమైన భారత్‌పై తమ ఎంపీలు విమర్శలు చేయడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అది తమ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించదని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ వివరించారు. తమ భాగస్వామ్య దేశాలన్నింటితో, ముఖ్యంగా పొరుగు దేశాలతో సానుకూల, నిర్మాణాత్మక చర్చలు కొనసాగించేందుకు మాల్దీవులు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

జరిగిన దానిపై భారతీయులకు కోపం రావడం న్యాయమేనని ఆ దేశ ఎంపీ, మాజీ స్పీకర్‌ ఈవా అబ్దుల్లా అన్నారు. ఎంపీలు మాల్షా షరీఫ్‌, మరియం శివునా, మష్జూమ్‌ మజిద్‌ దారుణమైన, జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని అన్నారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పిన ఈవా ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని భారత్‌కు విజ్ఞప్తి చేశారు. మాల్దీవుల ప్రభుత్వం వివాదానికి కారణమైన ముగ్గురు డిప్యూటీ మంత్రులను ఇప్పటికే సస్పెండ్‌ చేసింది.

లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవల ప్రధాని మోదీ అక్కడి బీచ్‌లో విహరించారు. యాత్రికులు లక్షద్వీప్‌ను తమ జాబితాలో చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. దీనిపై అక్కసు వెళ్లగక్కుతూ బీచ్‌ టూరిజంలో భారత్‌ తమతో పోటీ పడటంలో సవాళ్లు ఎదుర్కొంటోందని ఆ దేశ మంత్రులు పోస్టులు చేశారు. ఇది భారతీయ సెలబ్రిటీలు, నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

మాజీ అధ్యక్షుడి విచారం
మాల్దీవులు మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సొలీహ్ సైతం భారత్​కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. మాల్దీవులుకు భారత్ ఎప్పుడూ మంచి మిత్ర దేశంగానే ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు విద్వేష భాష ఉపయోగించడంపై విచారం వ్యక్తం చేస్తూ ఆదివారం ట్వీట్ చేశారు.

మోదీపై వ్యాఖ్యలు- ముగ్గురు మాల్దీవుల మంత్రులు సస్పెండ్?

బంగ్లా ప్రధాని పీఠం హసీనాదే- వరుసగా నాలుగోసారి విజయం- 200 సీట్లు కైవసం

Last Updated : Jan 8, 2024, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details