అమెరికా వీసా వ్యవస్థ భారతీయుల ఆశలకు అనుగుణంగా ఉండే విధంగా చూసేందుకు అగ్రరాజ్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. అంతేకాకుండా.. అగ్రరాజ్యంలో ఉన్న భారతీయులు, ఇక్కడ నుంచి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకుంటున్న వారు అసౌకర్యానికి గురవకుండాతగిన చర్యలు చేపట్టేందుకు కూడా చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. హెచ్1బీ విసా ఎంపిక విధానాన్ని మార్చనున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో శ్రీవాస్తవ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"తమ దేశంలో ప్రవేశించే వలసదారులపై మరో మూడు నెలల పాటు నిషేధం విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని మేము పరిశీలిస్తున్నాం. వీసా వ్యవస్థతో పాటు అమెరికాలోని భారతీయులు, అక్కడి వెళ్లాలనుకుంటున్న వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకునేందుకు అగ్రరాజ్యంతో సంప్రదింపులు జరుపుతున్నాం."