India Defeat Fans Death :సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఇద్దరు అభిమానులు గుండెపోటుతో మరణించారు. మరో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్.. ఆదివారం(నవంబర్ 19న) జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూస్తూ.. గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ జరిగింది..
సిర్మౌర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల సూరజ్ కుమార్ నాలుగేళ్ల క్రితమే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా విధులు ముగించుకొని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం తన మొబైల్లో లైవ్ మ్యాచ్‌ను పెట్టుకొని చూడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇంటి యజమాని కూతుర్ని టీ పెట్టుకొని తీసుకురావాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె సూరజ్ ఉన్న గదిలోకి ఛాయ్ తీసుకొని వచ్చింది. అప్పటివరకు ఫోన్లో మ్యాచ్ చూస్తున్న సూరజ్ ఒక్కసారిగా మంచంపై చలనం లేకుండా అపస్మారక స్థితిలో పడిపోయి ఉండడాన్ని చూసిన సదరు యువతి అతడిని లేపే ప్రయత్నం చేసింది. ఎంతకీ అతడు స్పందించకపోవడం వల్ల ఆమె తన కుటుంబ సభ్యుల సాయంతో సూరజ్‌ను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే సూరజ్ చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు.
అయితే ప్రాథమికంగా సూరజ్ గుండెపోటుతోనే మరణించాడని చెబుతున్నా పోస్ట్ మార్టం పరీక్ష నివేదిక వచ్చాకే మరణానికి అసలు కారణం తెలుస్తుందని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం యమునా నది ఒడ్డున సూరజ్ అంత్యక్రియలు జరిగాయి. మృతుడు సూరజ్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. నాలుగేళ్ల క్రితమే వివాహమైన అతడికి రెండున్నరేళ్ల కుమారుడు, ఆరు నెలల కుమార్తె ఉన్నారు.