INDIA Bloc Seat Sharing : బీజేపీని ఓడించడమే విపక్ష కూటమి ఇండియా ప్రధాన లక్ష్యమని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్-సీపీఎం) తెలిపింది. సీట్ల సర్దుబాటుపై విభేదాలు తలెత్తినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 400 స్థానాల్లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుందని ఆ పార్టీ మాజీ ఎంపీ, కేంద్ర కమిటీ సభ్యుడు హన్నన్ మొల్లా తెలిపారు. కూటమిలోని పార్టీలన్నీ సీట్ల సర్దుబాటును అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ తగిన ప్రాధాన్యం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పారు. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి ప్రచారం విషయంలోనూ అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు.
గత నెలలో దిల్లీలో జరిగిన విపక్ష ఇండియా కూటమి నాలుగో సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ క్రమంలోనే బంగాల్ అధికార పార్టీ టీఎంసీ, కాంగ్రెస్ మధ్య విబేధాలు తలెత్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్కు బహ్రంపుర్, మల్దా దక్షిణ లోక్సభ స్థానాలను ఇస్తామని టీఎంసీ నిర్ణయించడంపై హస్తం పార్టీ తీవ్రంగా మండిపడింది. అయితే, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్కు మరింత సమయాన్ని ఇస్తున్నట్లు తృణమూల్ చెబుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని స్థానాలను కేటాయించాలని టీఎంసీ కోరుతోంది.
"సీట్ల సర్దుబాటు అంశాన్ని సరైన పద్ధతిలో పూర్తి చేస్తాం. సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకోకపోతే, అనేక సంప్రదింపుల తర్వాత కేంద్ర నాయకత్వమే అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు గత నెలలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి."
--పవన్ ఖేడా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్, సీట్ల సర్దుబాటుపై ముందుండి నడిపించాలని జేడీయూ నేత కేసీ త్యాగి చెప్పారు. ఇతర పార్టీలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వ్యూహాన్ని రచించాలని కోరారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై కూటమిలోని పక్షాల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నాయని, కానీ వాటిని పరిష్కరించుకుంటామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా చెప్పారు.