ధ్వని కన్నా అనేక రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్ ఆయుధాలను (Hypersonic Weapons) అభివృద్ధి చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్ (Hypersonic Weapons India) కూడా ఉందని అమెరికా కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. ఈ సాంకేతికత కోసం రష్యాతో భాగస్వామ్యం వహించిందని తెలిపింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న హైపర్‌సోనిక్ క్షిపణిని (Hypersonic Missile) చైనా పరీక్షించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. స్వతంత్రంగా వ్యవహరించే కాంగ్రెస్ పరిశోధన సర్వీస్ (సీఆర్‌ఎస్) ఈ నివేదికను రూపొందించింది.
ఇందులోని అంశాల ప్రకారం..
- హైపర్‌సోనిక్ అస్త్రాల విషయంలో అమెరికా, రష్యా, చైనాలు ముందంజలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ దేశాలూ ఈ తరహా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.
- ఈ సాంకేతికత కోసం ఆస్ట్రేలియా.. అమెరికాతో భాగస్వామ్యం వహిస్తోంది. భారత్ మాత్రం రష్యాతో చేయి కలిపింది.
- ధ్వనితో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్-2 హైపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి కోసం భారత్, రష్యా సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ అస్త్రాన్ని 2017లోనే సైనిక దళాల్లో చేర్చాల్సింది. తీవ్ర జాప్యం కారణంగా.. 2025-28 మధ్య ఇది సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది.
- దీనికితోడు భారత్ సొంతంగా 'హైపర్‌సోనిక్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్ వెహికల్' కార్యక్రమం కింద ఒక హైపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాక్ 6 (ధ్వని కన్నా ఆరు రెట్లు వేగంగా పయనించే) స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను 2019 జూన్‌లో, 2020 సెప్టెంబరులో విజయవంతంగా పరీక్షించింది.
- భారత్ దాదాపుగా 12 హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్స్‌ను నిర్వహిస్తోంది. అక్కడ 'మ్యాక్ 13' వేగంలో కూడా పరీక్షలు నిర్వహించొచ్చు.