India Alliance Coordination Committee : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీఏను ఢీకొట్టేందుకు ఏర్పాటైన విపక్ష కూటమి ఇండియా మూడో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక భేటీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా ఎన్డీఏపై ఉమ్మడి పోరుకు అత్యంత కీలకమైన సీట్ల పంపకాలపై సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులతో ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఈ కమిటీ త్వరితగతిన పని ప్రారంభించనుంది. ఈ ప్యానెల్‌లో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, NCP అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్, తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ, శివసేన నేత సంజయ్ రౌత్ తదితరులు సభ్యులుగా ఉంటారు. విపక్ష కూటమి ఇండియాకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుంది. ఈ నెల 30 కల్లా సీట్ల పంపకాల అంశం కొలిక్కి తేవాలని విపక్ష కూటమి నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని ఇండియా కూటమిలో తీర్మానం చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సీట్ల పంపకాలు జరగాలని అందులో పేర్కొన్నారు. 'ఇండియా ఏకమౌతోంది, ఇండియా గెలుస్తుంది' అనే థీమ్‌తో సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి పోటీ చేయనుంది. ప్రజా సమస్యలపై దేశంలో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Opposition Meeting In Mumbai :విపక్ష కూటమి ఇండియాబలోపేతమవడం మోదీ సర్కారుకు ఆందోళన కలిగిస్తోందని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రతీకార రాజకీయాలకు బీజేపీ పాల్పడే ప్రమాదం ఉందని.. ఇందుకోసం విపక్ష నేతలపై దాడులకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఖర్గే హెచ్చరించారు. బీజేపీ నిరంకుశ పాలనలో సమాజంలో అన్ని వర్గాల వారు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం మోదీ ఎప్పుడూ పని చేయలేదని కార్పోరేట్ల పక్షానే నిలిచారని విమర్శించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై పోరాటమే తమ ఉమ్మడి లక్ష్యమన్నారు.
"ఇండియా కూటమిలోని పార్టీల ఉద్దేశం ఒక్కటే. అదేంటంటే పెరుగుతున్న ధరలను ఎలా నియంత్రించాలి, దీని కోసం ఎలా పోరాడాలి, నిరుద్యోగ నిర్మూలన కోసం ఎలా పోరాడాలి అనేది తేల్చుకోవడమే. ప్రస్తుతం పెట్రోల్, ఎల్‌పీజీ ధరలు దాదాపు రెండింతలు అయ్యాయి. మోదీ అన్నిసార్లు వంద రూపాయలు పెంచి రెండు రూపాయలు తగ్గిస్తారు. మోదీ పేద ప్రజల కోసం ఎప్పటికీ పని చేయరు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో కలిసి మెలిసి ఉంటారు. నిన్ననే రాహుల్ గాంధీ మీ ముందు ఓ నివేదిక గురించి ప్రస్తావించారు. అదానీ సంపద ఎలా పెరిగింది. పెరుగుదలకు ఎవరు కారణమయ్యారనే విషయాల్ని ఆయన తెలిపారు."
--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
దేశ జనాభాలో 60 శాతం మందికి ఇండియా కూటమి ప్రాతినిధ్యం వహిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కూటమి ఐక్యంగా ఉంటే ఎన్నికల్లో బీజేపీ నెగ్గడం అసాధ్యమన్నారు. ఇండియా కూటమి బీజేపీని ఓడిస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. ఇండియా కూటమి పార్టీల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలున్నా తామంతా కలిసి పని చేస్తామన్నారు. దేశ ప్రగతిలో పేద ప్రజలను భాగస్వామ్యం చేయడమే తమ అభివృద్ధి మార్గమని వ్యాఖ్యానించారు.
"మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వేదికపైన ఉన్నవారు.. 60 శాతానికి పైగా భారతీయ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న పార్టీలన్నీ కలిస్తే బీజేపీ ఎన్నికలలో గెలుపొందడం అసాధ్యం. కాబట్టి మన ముందన్న కర్తవ్యం ఏమిటంటే సాధ్యమైనంత ప్రభావవంతమైన మార్గంలో కలిసికట్టుగా రావడం. ఈ మేరకు రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. మొదటిది సమన్వయ కమిటీ, దాని కింద మిగిలిన కమిటీలు. రెండోది సీట్ల పంపకాలు, నిర్ణయాలను వేగవంతం చేసేందుకు నిర్ణయించాము."