శుభలేఖల్లో పేర్లతో ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చిన తమిళనాడుకు చెందిన జంట.. వివాహ బంధంతో ఒక్కటైంది. సేలం జిల్లాకు చెందిన వధూవరులు పీ మమతా బెనర్జీ, ఏఎం సోషలిజంకు ఆదివారం ఉదయం పెళ్లి జరిగింది. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం జరిపించారు పెద్దలు.
వినూత్న పేర్లతో ఉన్న ఈ యువ జంట పెళ్లి శుభలేఖ నెట్టింట్లో తెగ వైరల్ అయింది. వధువు పేరు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరును పోలి ఉండటం.. వరుడి పేరు సోషలిజం కావడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
అభిమానంతో అలా..
సేలం జిల్లా సీపీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లెనిన్ మోహన్.. కమ్యూనిజంపై అభిమానంతో తన కుమారులకు విభిన్న పేర్లు పెట్టారు. తమ భావజాలాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడానికి తన మనవడికి మార్క్సిజం అని పేరు పెట్టారు. భవిష్యత్తులో తమ ఇంట్లో అమ్మాయి పుడితే ఆమెకు క్యుబాయిజం అని నామకరణం చేస్తానని లెనిన్ మోహన్ చెప్పుకొచ్చారు.
వధువు కూడా లెనిన్ మోహన్ కుటుంబానికి బంధువే కావడం విశేషం. వధువు తాతయ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్ఫూర్తితో ఆమె పేరునే మనవరాలికి పెట్టుకున్నారు.
ఇవీ చదవండి: