తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్‌ నీడలో.. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ సన్నద్ధం!

దేశవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోన్న వేళ.. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణ ఓ సవాల్‌ అనే చెప్పవచ్చు. అయినప్పటికీ, ఇప్పటికే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం, అదే ధీమాతో నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలకు సిద్ధమైంది.

in shadow of a pandemic ec set for polls
కొవిడ్‌ నీడలో.. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ సన్నద్ధం!

By

Published : Mar 24, 2021, 9:43 PM IST

దేశంలో రెండో దఫా కరోనా విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలో.. సురక్షిత వాతావరణంలో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సజావుగా నిర్వహించగలిగింది. ఎన్నికలు జరపడం వల్ల వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ మాస్కులు, గ్లౌజులు, ఫేస్‌షీల్డ్‌లు, శానిటైజర్ల ఏర్పాట్లు, కొవిడ్‌ నిబంధనల నడుమ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది.

అదే ధీమాతో..

వైరస్‌ ఉద్ధృతి ఉన్నప్పటికీ బిహార్​లో 57.34శాతం ఓటింగ్‌ నమోదయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాదు, 2015 ఎన్నికలతో (56.8) పోలిస్తే ఈసారి అక్కడ ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైనట్లు గుర్తుచేసింది. వీటితో పాటే రాజ్యసభ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా 60శాసనసభ స్థానాల్లోనూ ఉపఎన్నికలు నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునిల్‌ అరోడా ఈ మధ్యే వెల్లడించారు. ఇదే ధీమాతో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం జరుగబోయే ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది.

18 కోట్ల ఓటర్లు..

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోన్న వేళ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహించవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. అయినప్పటికీ.. బంగాల్​, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఏప్రిల్‌ 27 నుంచి పలు దఫాల్లో ఎన్నికలు జరిపేందుకు ఈసీ సిద్ధమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తుండగా, అసోంలో మూడు దశల్లో, బంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది. ఈ రాష్ట్రాల్లో 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మొత్తం 18.68కోట్ల ఓటర్లు ఉండగా, వీరి కోసం 2.7లక్షల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కేవలం బంగాల్​లో క్రితం ఎన్నికల్లో 77వేల పోలింగ్‌ కేంద్రాలుండగా, కొవిడ్‌ విస్తృతి వేళ ఈసారి అక్కడ వాటి సంఖ్యను 1.1లక్షలకు పెంచినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

లక్షల సంఖ్యలో రక్షక కవచాలు..

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలను సురక్షిత వాతావరణంలో జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం లక్షల సంఖ్యలో మాస్కులు, ఫేస్‌షీల్డ్‌లు, పోలింగ్‌ సిబ్బందికి రబ్బరు గ్లౌజులు, ఓటర్లకు (ఈవీఎం, సంతకం పెట్టేందుకు) ఒకేసారి ఉపయోగించే గ్లౌజులను సేకరించింది. బిహార్‌ ఎన్నికల సమయంలో ఇలాంటి బయోమెడికల్‌ వ్యర్థాలే దాదాపు 160టన్నులు సేకరించినట్లు తెలిపింది. ఇక ఈ సారి ఈ వ్యర్థాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిర్లక్ష్యంతోనే ఆందోళన..

పూర్తి రక్షణలో ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి కొవిడ్‌ నిబంధనలపై ఆశించినంత స్పందన రావడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంతో పాటు ప్రచార సమయంలోనూ రాజకీయ పార్టీలు కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ, చాలా చోట్ల పలు పార్టీలు, కార్యకర్తలు మాత్రం కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. బిహార్‌ ఎన్నికల సమయంలో కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించిన సభల నిర్వాహకులపై దాదాపు 155 కేసులు నమోదుచేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కానీ, ప్రస్తుత ఎన్నికల సమయంలో అన్ని రాష్ట్రాల ప్రచార సభలు, సమావేశాల్లో కొవిడ్‌ నిబంధనలను అతిక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ వ్యాప్తి మళ్లీ పెరుగుతోన్న వేళ.. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు పండుగలు ఉండడంతో వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

ఇదీ చూడండి:ఎన్నికల్లో బైక్​ ర్యాలీలపై ఈసీ కీలక నిర్ణయం

ఇదీ చూడండి:ఆ ముగ్గురు ఎన్​డీఏ అభ్యర్థులకు చుక్కెదురు

ABOUT THE AUTHOR

...view details